హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకోవడానికి రోజుకో కొత్తరకం ఎత్తుగడతో వలవేస్తున్నారు. కానీ వాటిని గుర్తించి నివారించడంలోగానీ, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడంలోగానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు సైబర్ నేరగాళ్లు తెలంగాణ నుంచి రూ.1866.90 కోట్లు కొల్లగొట్టారు. ఈ ఏడాది 8 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 14,739 మంది నుంచి రూ.606.40 కోట్లు దోచుకున్నారు.
రిటైర్మెంట్ డబ్బులు, నెలవారీ వేతనాలు, పిల్లల పెండ్లిళ్ల కోసం దాచుకున్న నగదు, వ్యాపారాల కోసం కూడబెట్టిన నగదును అత్యంత సులభంగా ఒక్క లింకు పంపి కొల్లగొడుతున్నారు. ఏటా ఇలా పౌరుల నుంచి రూ.వేల కోట్ల నగదును సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నా, కట్టడి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని బాధితులు, ప్రజాసంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ప్రజలను చైతన్య పరిచే ఒక్క కార్యక్రమూ చేపట్టడం లేదని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాల రేటు దేశంలోనే అత్యధికంగా 40.3శాతానికి చేరిందని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి.
సైబర్ నేరగాళ్లు గతంలో నేరుగా ఫోన్లు చేసి మభ్యపెట్టి ఓటీపీలు తెలుసుకొని దోపిడీ చేసేవారు. ఆ తర్వాత ఏపీకే ఫైల్స్ పంపి, ఇన్స్టాల్ చేయించి డబ్బులు కొట్టేయడం మొదలు పెట్టారు. పీఎం కిసాన్ యోజన, ఎస్బీఐ రివార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌కార్డు, ఎస్బీఐ ఈకేవైసీ, యోనో ఎస్బీఐ, ఆర్టీఏ చలాన్స్ పేరుతో ఏపీకే ఫైల్స్ పంపి దండిగా దోచుకుంటున్నారు. తాజాగా పెండ్లి పిలుపును కూడా ఏపీకే ఫైల్స్ కోసం పంపుతున్నారు. ఏపీకే ఫైల్స్‌లో ప్రమాదకర మాల్వేర్, స్పైవేర్, ట్రోజన్ కోడ్లు ఉంటాయని సైబర్ నిపుణులు చెప్తున్నారు. ఒక్కసారి ఆ ఫైల్‌ను క్లిక్ చేస్తే ఫోన్ హ్యాంగ్ అయిపోయి, సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తున్నది. వీటివల్ల వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్వర్డ్లు, కాంటాక్ట్స్, మెసేజ్‌లు, గ్యాలరీ ఫైల్స్ వంటి వ్యక్తిగత డాటా హ్యాకర్ల చేతిలో పడుతుందని చెప్తున్నారు. దీంతోపాటు వాళ్ల ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్లకు కూడా ఆ ఏపీకే ఫైల్ షేర్ అవుతుందని వివరిస్తున్నారు. ఇలా వేలాది మందిని మోసం చేస్తున్నారని వెల్లడిస్తున్నారు.
సైబర్ నేరాలను అరికట్టడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తగడలను ఎలా చిత్తు చేయాలి? బాధితులు కోల్పోయిన నగదును తిరిగి వారికి ఎలా అందించాలి? అందుకు ఉన్న పరిమితులు, నిబంధనలు ఏంటి? నేరగాళ్లను పట్టుకోవడంలో తీసుకుంటున్న చర్యలేంటి? సైబర్ నేరాలపై ప్రజలకు ఇంకా ఎలా లోతుగా అవగాహన కల్పించొచ్చు? అందుకు తగిన కార్యచరణ ఏమిటి? అంతర్జాతీయ లింకులను ఎలా ఛేదించాలి? వారిని ఎలా కట్టడి చేయాలి? అనే విషయాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రజాసంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. నేరం జరిగితే నిందితులను అప్పుడప్పుడు పట్టుకుంటున్నారని, కానీ ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ట్రేడింగ్‌లో ఏఐ(అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో పనిచేసే ట్రేడింగ్ యాప్‌ల గూర్చి ఇంటర్నెట్లో శోధించిన మౌలాలీకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాఫ్‌కు హైనెట్ వర్త్ ట్రేడింగ్ గ్రూప్ పేరుతో ఆయనకు మేసేజ్ పంపించారు. . ఏఈతో కూడిన యాప్‌లతో అధిక లాభాలు ఇచ్చే విధంగా తమ గ్రూప్ తగిన సూచనలు చేస్తోందంటూ సూచించారు. అది నిజమని నమ్మిన బాధితుడు రూ. 2.36 కోట్లు పెట్టుబడి పెట్టి మోసానికి గురయ్యాడు.
వనస్థలిపురానికి చెందిన బాధితుడి ఫోన్ నెంబర్‌ను ‘డీ18 ఇండియా స్టాక్ పండిట్స్ సర్కిల్’ వాట్సాఫ్ నెంబర్‌కు యాడ్ చేశారు. ఆ తరువాత గ్రూప్ అడ్మిన్లు సురభి గుల్షన్ సింగ్ సొబ్టి ఫోన్ చేసి మేం ట్రేడింగ్ చేస్తున్నాం, మీకు అమెరికా, ఇండియా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌కు సంబంధించిన మెలుకువలు చెబుతామంటూ నమ్మించారు. రూ. 1.38 కోట్లు పెట్టుబడి పెట్టి మోసపోయాడు.
బోడుప్పల్లో నివాసముండే ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫోన్ నంబర్‌ను యాక్సెస్ సెక్యూరిటీ డైరెక్ట్ ట్రేడ్ అనే పేరుతో ఉన్న వాట్సాఫ్ గ్రూప్‌కు యాడ్ చేశారు. అందులోని లింక్‌ను క్లిక్ చేయడంతో సైబర్‌నేరగాళ్లు రూ. 73.78 లక్షలు సైబర్ దోపిడీకి పాల్పడ్డారు.
తార్నాకకు చెందిన 34ఏళ్ల మహిళను నేరగాళ్లు ఎన్ఎస్ఈ, కాయిన్ఎస్ఎస్డిసిఎక్స్లలో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా ఆన్లైన్ టాస్క్‌లతో పాటు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ ద్వారా పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహించారు. ఆమె కోటికిపైగా పంపించి, మోసపోయారు.
యూసుఫ్‌గూడకు చెందిన యువకుడిని ఫేస్బుక్ ద్వారా సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. ఆ తర్వాత 200మంది సభ్యులున్న ఎఫ్ 55 -ఫార్చ్యూన్ స్కైప్ అనే వాట్సప్గ్రూపులో యాడ్ చేశారు. పెట్టుబడులు పెడితే అధికలాభాలు వస్తాయని నమ్మించారు. గుడ్డిగా నమ్మిన అతడు రూ.28,76,715లు కోల్పోయాడు.
ఓ మ్యాట్నిమోని సైట్లో యువకుడు.. ఓ యువతి మాటలు నమ్మి రూ.25లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత బాధితుడు ఎంక్వైరీ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె డీపీగా అప్లోడ్ చేసిన ఫోటో పాకిస్తానీ యువతిదని తేలింది. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారానికి చెందిన ఓ శాస్త్రవేత్తపై కేసులు నమోదయ్యాయంటూ సైబర్ నేరగాళ్లు బెదిరించారు. భయపడ్డ సదరు శాస్త్రవేత్త నుంచి 12.5లక్షలు వసూలు చేశారు.