హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన 16 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నదని తెలంగాణ గిరిజన సంఘం నేతలు మండిపడ్డారు. హామీలపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి అమలుకు కార్యాచరణ ప్రకటించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్ అధ్యక్షతన శనివారం రాష్ట్ర విసృ్తత స్థాయి సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి, సహాయ కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నమ్మబలికిందని గుర్తు చేశారు. ఏడాదిన్నర గడిచినా హామీలు అమలు ఊసేలేదని ధ్వజమెత్తారు. దీంతో గిరిజనులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి హామీల అమలుకు కార్యాచరణ ప్రకటించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.