RTA Fancy Numbers | హైదరాబాద్ : తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్ల ఫీజులు భారీగా పెరిగాయి. కొత్త ధరలు లక్షన్నరకు పైగానే ఉన్నాయి. తెలంగాణ మోటారు వాహనాల నిబంధనలు-1989లోని రూల్ 81ను సవరిస్తూ ప్రభుత్వం జీ.ఓ నెం. 77ను శనివారం విడుదల చేసింది. ఈ సవరణలతో ఇకపై ఫ్యాన్సీ నంబర్లకు కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
అలాగే, ఒకే నంబర్‌కు ఇద్దరు లేదా అంతకంటే ఎకువ దరఖాస్తు చేసుకుంటే వేలం ద్వారానే నంబర్‌ను కేటాయించనున్నట్లు జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో 9999 ఫ్యాన్సీ నంబర్ గతంలో రూ.50 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.లక్షన్నరకు పెరిగింది. కొత్త ఆన్లైన్ విధానంతో వాహనదారులు రవాణా శాఖ పోర్టల్ (www.transport.telangana.gov.in)లో ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల మధ్య మాత్రమే దరఖాస్తు చేయాలి.
ఈ ఫీజుల పెంపుతో రవాణా శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2023-2024)లో హైదరాబాద్‌లోని ఐదు ఆర్టీఏలు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రికార్డు స్థాయిలో 124.2 కోట్ల ఆదాయాన్ని సమకూర్చాయి. తాజా సవరణలతో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్త నిబంధనలపై ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు లేదా సలహాలు ఉంటే, వాటిని 30 రోజుల్లోపు రవాణా శాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి పంపవచ్చని జీఓలో పేరొన్నారు.