తెలంగాణ రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. దేశంలోనే ఓడీఎఫ్ ప్లస్‌లో తెలంగాణ టాప్‌గా నిలిచింది. వందశాతం ఓడీఎఫ్ గ్రామాలతో రాష్ట్రం సత్తాచాటింది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిలోనూ ముందంజలో నిలిచింది. కేంద్ర సర్కారు తాజాగా ప్రకటించిన సర్వే ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాలు మన దరిదాపుల్లో లేకపోవడం మన పనితీరుకు నిదర్శనంగా నిలిచింది. సీఎం కేసీఆర్ మానసపుత్రిక పల్లెప్రగతితో తొమ్మిదేండ్లలోనే రాష్ట్రం ‘స్వచ్ఛ’ తెలంగాణగా అవతరించింది.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మన తెలంగాణ పల్లెలు మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచాయి. కొత్త రాష్ట్రమైన తెలంగాణ.. దేశంలో తనదైన ప్రత్యేకతను చాటింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఓడీఎఫ్ ప్లస్‌గా గుర్తింపు పొందింది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉన్న రాష్ట్రంగా కేంద్రం గుర్తించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు సర్వే ఫలితాలను ప్రకటించింది. వీటిలో మరోసారి తెలంగాణ సత్తా చాటింది.
ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ప్రతి ఒక్కరికీ మరుగుదొడ్డి వెళ్లేందుకు సౌకర్యం (యాక్సెస్) ఉన్న రాష్ట్రంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రంలోని దాదాపు గ్రామాలన్నీ బహిరంగ మల మూత్ర విసర్జనరహిత (ఓడీఎఫ్+) విభాగంలో చేరాయి. 2023 మార్చి 12 నాటికి పూర్తి చేసిన సర్వే ప్రకారం కేంద్రం ఓడీఎఫ్+ గ్రామాలను ప్రకటించింది. ఓడీఎఫ్+ గ్రామా లు, ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరికీ మరుగుదొడ్డి సౌకర్యం.. మూడు విభాగాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది.

Roads
కేంద్రం సహకరించకున్నా ముందంజ
ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల పురోగతి వివరాలను నమోదు చేసేందుకు కేంద్రం ఇటీవల అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ అధికారులు గ్రామాల్లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాల వివరాలను అప్లోడ్ చేశారు. ఓడీఎఫ్ ప్లస్‌లో తెలంగాణకు దరిదాపుల్లో వేరే ఏ రాష్ట్రం కూడా లేకపోవడం గమనార్హం. కేంద్రంలోని బీజేపీ పాలి త రాష్ర్టాలు, కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రాంతీ య పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలు సాధించలేని ఘనతను తెలంగాణ సాధించి చూపించింది. 25 ఏండ్లకుపైగా వరుసగా బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో కూడా నేటికీ అన్ని గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ విభాగంలోకి రాలేకపోయాయి.
బీజేపీపాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ర్టాలు ఏవీ కూడా తెలంగాణ దరిదాపులో లేవు. కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ర్టాలు కూడా ఈ ఘనతను సాధించలేకపోయాయి. కేంద్రం నుంచి సహకారం అందకపోయినా.. కేంద్రం నిధుల విడుదలలో జాప్యం చేసినా సీఎం కేసీఆర్ మానసపుత్రిక పల్లె ప్రగతితో తెలంగాణ ఓడీఎఫ్+లో టాప్‌గా నిలిచింది. ఓడీఎఫ్ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు ఏనాడో మారాయి. అంతటితో సంతృప్తి చెందకుండా ప్రతి గ్రామాన్ని ఓడీఎఫ్ ప్లస్‌గా మార్చాలనే సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీరాజ్ సిబ్బంది శ్రమించారు. ప్రజల్లో చైతన్యం, అవగాహన తీసుకొచ్చారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రాష్ర్టాన్ని దేశంలోనే ముందు నిలిపారు.
ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి
దేశంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే ముందు నిలిచింది. రాష్ట్రంలో 99.50 శాతం ప్రజలకు సొంత మరుగుదొడ్డి ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. 99.80 శాతం మందికి టాయిలెట్ యాక్సెస్ ఉన్నట్టు వెల్లడించింది. తెలంగాణతోపాటు చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరి ముందువరుసలో నిలిచింది. మిగిలిన రాష్ర్టాలు తెలంగాణ కంటే తక్కువ సంఖ్యలో మరుగుదొడ్లు కలిగి ఉన్నట్టుగా సర్వేలో తేలింది.
పల్లె ప్రగతితోనే ఓడీఎఫ్ ప్లస్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ పరిధిలోకి రావడం సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి ద్వారానే సాధ్యమైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన హర్షం వ్యక్తంచేశారు. కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహకారం వల్లే ఈ అవార్డులు దకాయని పేర్కొన్నారు. కేంద్ర సర్కారు ప్రశంసలతోపాటు నిధులు కూడా ఇవ్వాలని కోరారు. తెలంగాణపై వివక్ష చూపొద్దని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములై దేశానికి ఆదర్శంగా నిలిచిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, ఇతర ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, తన సిబ్బంది, గ్రామ పంచాయతీల సిబ్బందికి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పేరు పేరునా ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.
డబుల్ ఇంజిన్‌తో పనిలేకుండా డబుల్ ప్రతిభ: మంత్రి హరీశ్‌రావు
దేశంలోనే ఓడీఎఫ్ ప్లస్‌లో తెలంగాణ టాప్‌గా నిలువడం గర్వకారణమని, డబుల్ ఇంజిన్‌కు, డబుల్ వర్కింగ్ సరార్లకు తేడా ఇదేనని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ ఇంజిన్‌ను కాదు.. డబుల్ పనితీరును నమ్ముతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనిక పథకమైన పల్లె ప్రగతి ద్వారానే ఇది సాకారమైందని పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలోనే తెలంగాణలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని కల్పించిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కిందన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన బృందాన్ని హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు.
ఓడీఎఫ్ ప్లస్ అంటే?
ప్రతి ఇంటికి కేవలం మరుగుదొడ్డి నిర్మించుకొంటే ఓడీఎఫ్‌గా ప్రకటిస్తారు. ఆ తర్వాతి దశ ఓడీఎఫ్ ప్లస్. ఇందులో భాగంగా గుర్తింపు పొందాలంటే గ్రామంలోని ఇండ్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలన్నింటిలోనూ మరుగుదొడ్లు నిర్మించడం, ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుల్లో తడి, పొడి చెత్తగా వేరుచేయడం, ప్రతి గ్రామంలో చెత్తను సేకరించడం, వైకుంఠ ధామాలు, ఇంకుడు గుంతలు నిర్మించడం, రోడ్లపై నీళ్లు నిలువకుండా చేయడం వంటి కార్యకలాపాలు చేపట్టాలి. ఇలా అన్ని విభాగాల్లోనూ మన రాష్ట్రం దేశంలో ముందు నిలిచింది.

Print2