హైదరాబాద్, ఫిబ్రవరి 3 : కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ పంపిణీలో తెలంగాణ అన్ని రాష్ర్టాల కన్నా ముందున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోకి వలసలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో లక్ష్యానికి మించి టీకాల పంపిణీ జరుగుతున్నది. ఇప్పటివరకు 105 శాతం మందికి మొదటి డోస్ పంపిణీ చేయడంతో తెలంగాణ దేశంలోనే అత్యధిక రేటు నమోదు చేసింది. ఢిల్లీ 103 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2.77 కోట్ల మందికి మొదటి డోస్ వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. బుధవారం వరకు 2.90 కోట్ల మందికి టీకాలు వేశారు. లక్ష్యం కన్నా 13 లక్షల టీకాలను అదనంగా పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 12 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 100 శాతం మొదటి డోస్ పంపిణీ చేసినట్టు గణాంకాలు చెప్తున్నాయి.
రికార్డు సృష్టించిన హనుమకొండ
వ్యాక్సినేషన్లో హనుమకొండ జిల్లా అరుదైన ఘనత సాధించింది. మొదటి డోస్, రెండో డోస్ టీకాల పంపిణీని విజయవంతంగా పూర్తిచేయడంతోపాటు 15-17 ఏండ్లవారికి 100 శాతం టీకాలు పంపిణీ చేసిన మొదటి జిల్లాగా రికార్డు సృష్టించింది. జిల్లాలో మొదటి డోస్ 106 శాతం, రెండో డోస్ 101 శాతం, టీనేజర్లకు 102 శాతం టీకాలు పంపిణీ చేశారు.