JEE Advanced | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. టాప్ -10 ర్యాంకుల్లో మూడు రాష్ట్ర విద్యార్థులే కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ విద్యార్థి బీ సందేశ్ ఆలిండియా మూడోర్యాంకుతో అదరగొట్టాడు. ఇక పుట్టి కుశాల్‌కుమార్ ఐదోర్యాంకు, ఎస్‌ఎస్‌డీబీ సిద్ధిక్ పదో ర్యాంకుతో సత్తాచాటారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఐఐటీ మద్రాస్ ఈ ఫలితాలను విడుదల చేసింది.
ఆలిండియా టాప్ -10లో ఐఐటీ మద్రాస్ జోన్ నుంచి నలుగురు విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. దీంట్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులుండటం విశేషం. మద్రాస్ జోన్ నుంచి టాప్ -100లో 9, టాప్ -200లో 13, టాప్ -300లో 27, టాప్ -400లో 38, టాప్ -500లో 48 మంది విద్యార్థులున్నారు. మద్రాస్ జోన్ నుంచి మొత్తంగా 5,136 మంది క్వాలిఫై అయ్యారు. తెలంగాణ విద్యార్థి శ్రీనిత్య దేవరాజ్ 268 మార్కులతో మద్రాస్ జోన్ మహిళా టాపర్‌గా నిలిచింది.
శ్రీనిత్య ఆలిండియా ఓపెన్ కోటాలో 268 ర్యాంకును సాధించింది. అన్ని ఫలితాల్లో అమ్మాయిలు సత్తాచాటుతుండగా, అడ్వాన్స్డ్ ఫలితాల్లో మాత్రం అబ్బాయిల హవా కొనసాగింది. ఈ పరీక్షకు అత్యధికంగా అబ్బాయిలే హాజరుకాగా, క్వాలిఫై అయినవారిలోనూ అత్యధికంగా వారే ఉన్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు జాతీయంగా 1,86,584 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,80,200 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 48,248 మంది క్వాలిఫై అయ్యారు.
‘నల్లమల విద్యార్థి ప్రజిత్కు 117వ ర్యాంక్
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో అచ్చంపేటకు చెందిన శివ్వా రామ్నాగ ప్రజిత్, అరవింద్‌నాయక్ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ప్రతిభ కనబర్చారు. ప్రజిత్ ఆలిండియా జనరల్ కేటగిరీలో 117వ ర్యాంక్ సాధించగా.. అరవింద్‌నాయక్ ఎస్టీ కేటగిరీలో 33వ ర్యాంక్ సాధించారు.
బీసీ గురుకుల విద్యార్థులకు ర్యాంకులు
ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో బీసీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు. బీ నిఖిత(267), ఆర్ పల్లవి(306), ఎస్ నందిని(768), కే అఖిల్ (1667), ఏ జగదీశ్(2360), ఎం శివకుమార్(4790) ర్యాంకులు సొంతం చేసుకున్నారు. బీసీ గురుకులాల నుంచి 21మంది అబ్బాయిలు, 28మంది అమ్మాయిలు మొత్తంగా 49మంది అడ్వాన్స్డ్ పరీక్షలు రాశారు. వారిలో ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, అధ్యాపక సిబ్బందిని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, గురుకుల విద్యాలయాల సెక్రటరీ సైదులు అభినందించారు.
సివిల్స్ రాసి.. ఐఏఎస్ అవుతా
ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ వరకు మాదాపూర్‌లో చదివా. నాన్న రామసుబ్బారెడ్డి, అమ్మ రాజేశ్వరి ప్రభుత్వ టీచర్లు. పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్లో 987 మార్కులొచ్చాయి. జేఈఈ మెయిన్‌లో 99 పర్సంటైల్, తెలంగాణ ఎప్‌సెట్‌లో 4వ ర్యాంకు వచ్చింది. 338 మార్కులతో జేఈఈ అడ్వాన్స్డ్ టాప్ -3లో నిలువడం సంతోషాన్నిచ్చింది. రోజుకు పది గంటలకు పైగా కష్టపడ్డా. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ కోర్సులో చేరుతా. చదువులు పూర్తయ్యాక, సివిల్స్ రాసి ఐఏఎస్ ఆఫీసర్‌ను అవుతా. – సందేశ్, ఆలిండియా మూడో ర్యాంకు
బాంబే ఐఐటీలో సీఎస్ఈ కోర్సులో చేరుతా..
నాకు జేఈఈ మెయిన్‌లో 295 మార్కులొచ్చాయి. ఆలిండియా ర్యాంకు 120 వచ్చింది. అయినా నిరాశపడకుండా అడ్వాన్స్‌డ్‌కు అవిశ్రాంతంగా కష్టపడ్డా. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 334 మార్కులొచ్చాయి. ఆలిండియా ఐదో ర్యాంకు వచ్చింది. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ కోర్సులో చేరుతా. తెలంగాణ ఇంటర్ పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధించా. నాన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్, అమ్మ గృహిణి. ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు బ్యాడ్మింటన్ ఆడేవాడిని.
– పుట్టి కుశాల్‌కుమార్, ఆలిండియా ఐదో ర్యాంకు
కంపెనీ పెడుతా.. సీఈవో అవుతా
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా పదో ర్యాంకు రావడం సంతోషాన్నిచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 10 -12 గంటలు కష్టపడ్డా. కష్టానికి తగినట్టు 329 మార్కులొచ్చాయి. నాన్న సతీశ్ ఐఆర్ఎస్ అధికారి. అమ్మ సుష్మ గృహిణి. ప్రిపరేషన్ సమయంలో అస్సలు టెన్షన్పడలేదు. ర్యాంకు కోసం నేను చదవలేదు. నలుగురిలా పనిచేయడం కాకుండా నలుగురికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని నాన్న ఉద్భోదించారు. బీటెక్ తర్వాత కంపెనీ పెడుతా.. సీఈవోనవుతా. – ఏ ఎస్‌ఎస్‌డీబీ సిద్ధిక్ సుహాస్,
ఆలిండియా 10వ ర్యాంకు
సౌత్ జోన్ మహిళ టాపర్‌గా శ్రీనిత్య దేవరాజ్
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలంగాణ విద్యాకుసుమం సత్తా చాటింది. రెండు లక్షల మంది విద్యార్థుల్లో సౌత్ జోన్లోనే మహిళ టాపర్‌గా నిలిచింది హైదరాబాద్‌కు చెందిన శ్రీనిత్య దేవరాజ్. నిమ్స్ యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, అనస్థీషియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిరా దేవరాజ్ దంపతుల కుమార్తె శ్రీనిత్య దేవరాజ్ చిన్నప్పటి నుంచే చదువులో టాపర్‌గా నిలిచింది. నగరంలోని నారాయణ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తూ ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 268వ ర్యాంకు సాధించింది. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేయాలన్నది తన ఆశయమని శ్రీనిత్య పేర్కొన్నారు.
క్యాటగిరీ క్వాలిఫై అయినవారు
జనరల్ : 14,083
జనరల్ పీడబ్ల్యూడీ : 236
ఓబీసీ ఎన్సీఎల్ : 9,281
ఓబీసీ పీడబ్ల్యూడీ : 218
జనరల్ ఈడబ్ల్యూఎస్ : 5,423
ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ : 85
ఎస్సీ : 13,794
ఎస్సీ పీడబ్ల్యూడీ : 41
ఎస్టీ : 5,073
ఎస్టీ పీడబ్ల్యూడీ : 14
మొత్తం : 48,248
తెలుగు విద్యార్థుల ర్యాంకులిలా..
విద్యార్థి పేరు : ర్యాంకు
హెచ్ సాయి విదిత్ : 63
శ్రీ చరణ్ : 51
లక్ష్మీనర్సింహ : 70
సూర్యవర్మ : 76
అనూప్ : 166