హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : రాబోయే పదేండ్లల్లో రాష్ర్టాన్ని మరింత అభివృద్ధిపథంలో నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ వెల్లడించారు. యువ ఆలోచనలను మేళవించి పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, ఆర్థికవృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన కొనసాగుతున్నదని తెలిపారు.
విద్యుత్తును విక్రయించే స్థాయికి రాష్ట్రం ఎదుగుతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్‌ను వినోద్‌కుమార్ బుధవారం ఆవిష్కరించారు. ఖైరతాబాద్‌లోని అర్థగణాంకశాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డితో కలిసి తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరించి వినోద్ మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా కొత్త జోనల్ విధానాన్ని, కొత్త మండలాలతో కూడిన మ్యాపులను ఈ నివేదికలో పొందుపరిచామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ పురోగతి, జీడీపీ, అభివృద్ధి సంక్షేమ పథకాల విరరాలను ఈ పుస్తకంలో సవివరంగా పొందుపరిచామని చెప్పారు. మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు నడిచే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వెల్లడించారు. పరిశ్రమలు పెట్టుబడిపెట్టేందుకు రాష్ర్టానికి ఎగబడి వస్తున్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగని వాతావరణం, పెట్టుబడిదారులకు వేధింపులు, ఇబ్బందులు లేని కారణంగానే పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని తెలిపారు. కేటీఆర్ దోవోస్ పర్యటనలో మరో 21 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.
శాటిలైట్‌తో పంటల సమాచారం
రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో పండుతున్నదో తెలుసుకునేందుకు శాటిలైట్ సేవలను వినియోగించుకోబోతున్నామని వినోద్‌కుమార్ ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ సంస్థ సహకారంతో రాష్ట్రంలో వరి, పత్తి వంటి పంటల విస్తీర్ణాన్ని అంచనా వేయబోతున్నట్టు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులుంటాయని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారని, కాని అపార భూగర్భజలాలను నిల్వచేసుకున్న తెలంగాణ ఈ పరిస్థితి నుంచి గట్టెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో 298 గురుకులాలుంటే ప్రస్తుతం 1,201కి చేరుకున్నాయని తెలిపారు. గురుకులాలు, ఆర్జీయూకేటీల్లో సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులే కైవసం చేసుకుంటుండటంతో పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు గ్రామాలకెళ్లి చదువుకుంటున్న ఉదాహరణలున్నాయని వివరించారు.
వాన రాకడ ముందే తెలుస్తుంది
రాష్ట్రంలో వర్షం ఎప్పుడు పడుతుందో, వాతావరణ స్థితిగతులు ఎలా ఉన్నాయో క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నామని వినోద్‌కుమార్ తన స్వీయ అనుభవాన్ని వివరించారు. ‘నా కుమారుడి వివాహం అనుకోకుండా వర్షాకాలంలో వచ్చింది. వర్షాలు ఇబ్బంది పెడుతాయేమోనని ఆందోళన చెందా. కాని టీఎస్‌డీపీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు నన్ను అప్రమత్తం చేశారు. మబ్బులు, గాలులు, చినుకులు పడే సమాచారాన్ని అందజేశారు. తొలుత చినుకులు పడతాయని సమాచారమిచ్చారు. తర్వాత వాతావరణం మారి, మబ్బులు దారిమళ్లడంతో వర్షం ఇబ్బందులు తొలగిపోయాయి.
ఇలా విలువైన సమాచారాన్ని అందజేయడంతో సాఫీగా వివాహం చేయగలిగాం అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎకనమిక్ అండ్ స్టాటిస్టికల్ విభాగం డైరెక్టర్ జీ దయానందం, రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామకృష్ణ, కన్సల్టెంట్ రామభద్రం, అదనపు డైరెక్టర్ శివకుమార్, టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.