హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ) : నిబంధనలకు వ్యతిరేకంగా, అనుమతులు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ఇరిగేషన్ ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఆ రెండు ప్రాజెక్టులపై పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. గోదావరి, కృష్ణా నదులపై కొత్తగా ఏదైనా సాగునీటి ప్రాజెక్టును చేపట్టాలంటే ఆయా రివర్ బోర్డులతోపాటు అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ అనుమతి అవసరం. కానీ, అందుకు విరుద్ధంగా ఏపీ సర్కారు చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులపై ఎన్జీటీ ఇప్పటికే స్టే విధించింది. పర్యావరణ అనుమతుల జారీకి కేంద్రం కూడా నిరాకరించింది. కాగా, ఇటీవల ఏపీ ప్రభుత్వం వరద జలాల పేరిట గోదావరి-బనకచర్ల ఇరిగేషన్ స్కీమ్‌ను చేపట్టి 200 టీఎంసీల జలాలను గోదావరి నుంచి పెన్నా బేసిన్ తరలించేందుకు రూ.80 వేల కోట్లతో ప్రణాళికలను సిద్ధం చేసింది. ఆ ప్రణాళికలకు తాజాగా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆ రెండు ప్రాజెక్టులపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఎర్రమంజిల్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అనిల్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌తో చర్చించారు. అనంతరం ఆ రెండు ప్రాజెక్టులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తేల్చారు. అందుకోసం త్వరలో అడ్వకేట్ జనరల్‌తోపాటు ఇరిగేషన్ న్యాయవాదులు, సాగునీటి రంగ నిపుణులతో ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించారు. పోలవరం నుంచి రాయలసీమకు ఏపీ నీటిని తరలిస్తే.. గోదావరి తీరంలోని భద్రాచలం పుణ్యక్షేత్రం మునిగిపోతుందని మంత్రి ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పట్టణం చుట్టూ ప్రొటెక్షన్ వాల్‌ను నిర్మించేందుకు కేంద్ర సాయం తీసుకోవాలని, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా స్పందించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు హకుగా రావాల్సిన ఒక నీటి బొట్టునూ వదిలిపెట్టబోమని, అందుకోసం వాస్తవాలు, చట్టంలోని నిబంధనలు, రాష్ట్ర ప్రజల ప్రాథమిక హకుల ఆధారంగా సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాడుతామని తేల్చి చెప్పారు. ప్రాజెక్టుల్లో పూడికతీతకు త్వరలో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఝంజావతి నదిపై నిర్మించిన రబ్బర్ డ్యామ్‌ను తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఆ డ్యామ్‌ను నిర్మించిన విధానం, పనితీరు గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన వీరాంజనేయ (ఏదుల) రిజర్వాయర్ నుంచి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ ప్రాజెక్టుకు నీటిని తరలించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఏదుల నుంచి పోతిరెడ్డిపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలిస్తారు. పోతిరెడ్డిపల్లి వద్ద 350 మీటర్ల పొడవుతో రబ్బర్ డ్యామ్‌ను నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ర్టాల్లో ఉన్న రబ్బర్ డ్యామ్‌లను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఝంఝౌవతి నదిపై 2006లో నిర్మించిన రబ్బర్ డ్యామ్‌ను నల్గొండ సీఈ అజయ్ కుమార్, సీడీవో సీఈ మోహన్ కుమార్ బృందం పరిశీలించింది. రబ్బర్ డ్యామ్ నిర్మాణానికి అయిన ఖర్చు, పనితీరు, డిజైన్లు తదితర సాంకేతిక అంశాలను అధ్యయనం చేశారు.
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై భాగస్వామ్య రాష్ర్టాలతో ఈ నెల 7న నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) నిర్వహించ తలపెట్టిన సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు అథారిటీ అధికారులు రాష్ర్టాలకు సమాచారం అందించారు. జీసీ లింక్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకు ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే నిర్ణయించింది. ఆ సమావేశాన్ని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించాలని తెలంగాణసహా ఇతర రాష్ర్టాలు కోరాయి. ఆ సమావేశానికి నేతృత్వం వహించాల్సిన కేంద్ర జల్‌శక్తిశాఖ అదనపు కార్యదర్శి ప్రస్తుతం విదేశీపర్యటనలో ఉన్నారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించిన ఎన్‌డబ్ల్యూడీఏ.. తదుపరి తేదీని ప్రకటించలేదు. కానీ, ఆ సమావేశాన్ని ఫిజికల్ మోడ్‌లో ఢిల్లీలోనే నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.