హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలను అరికట్టే ఉద్దేశంతో నల్సార్ యూనివర్సిటీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నదని, ఈ-కామర్స్‌పై కేంద్రం జాతీయ పాలసీని సత్వరం తేవాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కామర్స్‌కు అనుబంధంగా ఉన్న ఆన్లైన్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ పేమెంట్స్, అత్యుత్తమ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండటం వంటి అంశాలపై విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సోమవారం అసెంబ్లీ కమిటీహాల్లో వాణిజ్య విధానంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది.
కమిటీ చైర్మన్ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఈ-కామర్స్ వాణిజ్యం తీరుతెన్నులపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సిటిజన్ సర్వీస్ డెలివరీ విషయంలో కేంద్రం మరింత చురుగ్గా కదలాలని, ఈ కామర్స్, సాంకేతిక రంగాల్లో మార్పులను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉన్నదని చెప్పారు. ఈ-కామర్స్ కార్యకలాపాలకు తగ్గట్టుగా డిజిటల్ లిటరసీపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్రం చేపట్టిన భారత్నెట్తోపాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ ఇంటర్నెట్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలని, దేశంలోని సూక్ష్మ, మధ్యతరహా పారిశ్రామిక రంగానికి ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు.
అన్ని రంగాల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష
తెలంగాణపై అన్ని రంగాల్లో కేంద్రం వివక్ష చూపుతున్నదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నేషనల్ డిజైన్ సెంటర్, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల వరకు అనేక హామీలను కేంద్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ఇండస్ట్రియల్ కారిడార్‌తోపాటు డిఫెన్స్ కారిడార్, ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్కు ఆర్థిక సహాయం వంటి అనేక అంశాలపై కేంద్రం స్పందించడం లేదని అన్నారు. ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని కోరినా స్పందన లేదని చెప్పారు. ఏడున్నర ఏండ్లలో దేశంలో అన్నిరంగాల్లో అద్వితీయ ప్రగతి సాధించిన తెలంగాణకు కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు కరువయ్యాయని తెలిపారు. కేంద్రం నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
దేశమంతటికీ మా సంపద
తెలంగాణ అభివృద్ధి అంటే భారతదేశ అభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని కేటీఆర్ హితవు పలికారు. ఏడున్నర ఏండ్లలో తలసరి ఆదాయం, జీఎస్డీపీల్లో తెలంగాణ రెట్టింపు వృద్ధిని నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పార్లమెంటరీ కమిటీ దృష్టికి మంత్రి కేటీఆర్ తీసుకొచ్చారు. తెలంగాణ నుంచి వచ్చే సంపద దేశంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తున్నారని, ఇది తమకు గర్వకారణమని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మరింత సహకారం అందించాలని కోరారు. మేకిన్ ఇండియా నినాదం నిజరూపం దాల్చాలంటే కేంద్రం మరిన్ని పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు విధానపరమైన నిర్ణయాలు తీసుకొన్నప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. కమిటీ సభ్యుల్లో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, రూపా గంగూలీ సహా పలువురు ఎంపీలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ప్రతినిధులు, బ్యాంకింగ్, ఈ కామర్స్ సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, శాసనసభ సెక్రటరీ వీ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.