హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్యను 33కు పెంచుతామని, హెల్త్ యూనివర్సిటీల్లో పారామెడికల్ కోర్సులను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు, కేసీఆర్ కిట్ల కారణంగా మాతా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వివరించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఆరోగ్య తెలంగాణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని మొదట్లోనే ఆలోచించినం. ప్రత్యేకంగా అధ్యయనం చేసినం. స్మితాసబర్వాల్ ఆధ్వర్యంలో ఇంకో నలుగురు ఐఏఎస్ అధికారుల టీమ్‌ను తమిళనాడుకు పంపినం. ఎన్నో విషయాలు తెలుసుకున్నం. వాటిని మన స్థాయిలో అమలు చేసినం. కేసీఆర్ కిట్ ప్రారంభించినం. దవాఖానల్లో ప్రసవాలు పెంచినం. అంగన్వాడీల్లో గుడ్లు, పాలు ఎక్కువ ఇస్తున్నం. ప్రస్తుతం మాతా మరణాలు అరికట్టడంలో తమిళనాడు కంటే మనమే ముందున్నం. ఇదే విషయాన్ని రెండు, మూడ్రోజుల క్రితమే నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. తమిళనాడుకు మన బృందం వెళ్లినప్పుడు మాతా మరణాల రేటు తెలంగాణలో 92 ఉంటే, తమిళనాడులో 72 ఉన్నది. ప్రస్తుతం తమిళనాడులో 58 ఉంటే తెలంగాణలో 56 ఉన్నది. తమిళనాడు కంటే మన దగ్గరే రెండు తక్కువగా ఉన్నది. హెల్త్ డిపార్ట్మెంటును అభినందిస్తున్న. ఆరోగ్య పరిరక్షణలో తెలంగాణ ఎంతో ప్రతిభను చాటింది. తెలంగాణ ఏర్పడినప్పుడు 3 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్యను 33కి పెంచుకోబోతున్నాం. అన్ని హెల్త్ యూనివర్సిటీల్లో పారామెడికల్ కోర్సులు ఏర్పాటుచేస్తాం. రాష్ట్రంలో ఒకప్పుడు 13 విశ్వవిద్యాలయాలు ఉండేవి, వాటికి తోడు ప్రస్తుతం కొత్తగా ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి మరో 11 ఏర్పాటుచేసుకున్నం.