హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది నాటికి విద్యుత్తును అమ్మే స్థాయికి తెలంగాణ చేరుకుంటుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నా రు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అంధకారం ఖాయం అన్న చోటే వెలుగులు జిలుగులతో విరాజిల్లుతున్నదని, ఇప్పుడు దేశానికే రోల్ మాడల్‌గా నిలిచిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగానే కాకుండా సీఈవో, సీఎఫ్‌వోగా (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) మారి అహర్నిశలు శ్రమించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని వెల్లడించారు. సీఐఐ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సీఎఫ్‌వో కాంక్లేవ్ నాలుగో ఎడిషన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్ మా ట్లాడుతూ.. సాంకేతికత, పరిశోధన, సుపరిపాలన అనే అంశాలతో సభ నిర్వహించటం గొప్ప విషయమని అభినందించారు.
సీఎఫ్‌వోల కృషితో సంస్థలు, తద్వారా దేశం బలపడుతుందన్నారు. గతంలో ఎంతో మంది సీఎంలను చూశామని, కొందరు సంక్షేమంపై దృష్టి పెడితే మరికొందరు అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. కానీ సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధిని సమానంగా పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. అభివృద్ధిని ఏ ఒక్క రంగానికో పరిమితం చేయకుండా ఐటీ, వ్యవసాయం ఇలా అన్నింటా సమానంగా చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టానికి సీఈవోగా, సీఎఫ్‌వోగా మారి శ్రమించటం వల్ల ఇప్పుడు తెలంగాణ దేశానికే రోల్ మాడల్‌గా నిలిచిందని తెలిపారు. ఒకప్పుడు బతుకుదెరువు కోసం బొంబాయి, దుబాయ్ బాట పట్టేవారని, ఇప్పుడు వలసలు పూర్తిగా బంద్ బయ్యాయని వెల్లడించారు.
తలసరి ఆదాయంలో నం.1
రూ.3.17 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నామని మంత్రి హరీశ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడితే అంధకారం ఖాయమని అవమానించిన తెలంగాణ.. ఇప్పుడు నాణ్యమైన 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచిందని గుర్తు చేశారు. విద్యుత్తు సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.40 వేల కోట్లు వెచ్చించిందని, హైదరాబాద్‌లో ఏ రకమైన కరెంటు సరఫరా అవుతున్నదో, రాష్ట్రంలోని చివరి గ్రామంలోనూ అంతే నాణ్యమైన కరెంటు వస్తున్నదని వివరించారు. రాష్ట్రంలో ఇప్పుడు వ్యవస్థాపిత విద్యుత్తు సామర్థ్యం 17 వేల మెగావాట్లు ఉన్నదని వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికి మరో 20 వేల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీంతో వచ్చే ఏడాది నుంచి తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు కరెంటును అమ్మే స్థాయికి చేరుకుంటుందని చెప్పారు.
ధాన్యం ఉత్పత్తిలో నం.1
దేశంలో ధాన్యం ఉత్పత్తిలో 40 ఏండ్లుగా పంజాబ్ మొదటి స్థానంలో ఉండేదని, ఇప్పుడు తెలంగాణ దాన్ని అధిగమించిందని హరీశ్‌రావు తెలిపారు. ఈ దఫా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నట్టు వివరించారు. ఇక, గతంలో నీటి సమస్య గురించి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళనలు చేపట్టేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ఆయన సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి, పీఎం అయ్యాక ప్రారంభించారని చెప్పారు. దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏండ్లకేండ్లు నిర్మాణదశలోనే ఉండటం వల్ల ఫలితాలు ప్రజలకు అందటం లేదని తెలిపారు. తెలంగాణలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును సృష్టించామని వెల్లడించారు.
రిజిస్ట్రేషన్లలో ధరణి విప్లవం
రిజిస్ట్రేషన్లలో ధరణి విప్లవం సృష్టించిందని హరీశ్‌రావు తెలిపారు. నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయ్యి ఒకటి, రెండు వారాల్లోనే పాస్‌బుక్ నేరుగా ఇంటికి వస్తున్నదని వెల్లడించారు. ఇప్పటివరకు రైతులకు రైతుబంధు కింద రూ.65 వేల కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఒకే క్లిక్‌తో 65 లక్షల మంది రైతులకు ఒకేసారి అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు. ఇదే తరహాలో 46 లక్షల మంది ఆసరా లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను డబ్బు జమ చేస్తున్నామని వివరించారు. సీఐఐ చైర్మన్ సీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐటీని కేవలం హైదరాబాద్‌కే కాకుండా సిద్దిపేట వంటి జిల్లాకేంద్రాల్లోనూ ఐటీ టవర్లు నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో సీఐఐ కన్వీనర్ ఎంవీ నరసింహం, కో కన్వీనర్ ఆనంద్ దగ, వీ లక్ష్మీనాథ్, ప్రవీణ, రాజేశ్ దుడ్డు తదితరులు పాల్గొన్నారు.
ఐటీ, పరిశ్రమల వృద్ధిలో నం.1
ఐటీ, పరిశ్రమల వృద్ధిలోనూ తెలంగాణ నెంబర్ వన్‌గా ఉన్నదని మంత్రి హరీశ్ అన్నారు. ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించామని అన్నారు. గ్రామీణ, పట్టణ అభివృద్ధిలో 34% అవార్డులు తెలంగాణకే ఇస్తున్నారని, తొమ్మిదేండ్లలో గ్రీన్ కవర్ 7.4 శాతానికి పెంచిన ఏకైక రాష్ట్రమని, దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో టాప్‌లో ఉన్నామని చెప్పారు. అందుకే పెద్దఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని వెల్లడించారు. అయితే, ఇదే సమయంలో దేశంలోని కోటీశ్వరులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.