‘ఒక దేశ మూలధన అభివృద్ధి ఆటలో పావులా మారితే.. అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను రోగగ్రస్తం చేస్తుంది’ -జాన్ మేనార్డ్ కీన్స్, ప్రముఖ ఆర్థికవేత్త
ఏ దేశమైనా తన బడ్జెట్లో మూలధన వ్యయం, అభివృద్ధికి ఎంతటి విలువ ఇవ్వాలో చెప్పే వాక్యమిది. మూలధన వ్యయం ఆ దేశ అభివృద్ధికి కొలమానంగా నిలుస్తుంది. మౌలిక వసతుల కల్పన, సంపద సృష్టికి మూలకారణమవుతుంది. అందుకే చాలాదేశాలు దీనికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. సరిగ్గా తెలంగాణ కూడా అదే దారిలో నడుస్తున్నది. ఏటికేడు వార్షిక బడ్జెట్లో మూలధన వ్యయాన్ని పెంచుకొంటూ పోతున్నది. అదే సమయంలో సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నది. ఇలా ఏకకాలంలో సంపద సృష్టితోపాటు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు తిరుగులేని అభివృద్ధి ఫార్ములాను అనుసరిస్తూ.. తిరుగులేని సంక్షేమ రాజ్యాన్ని ఆవిష్కరిస్తున్నది.
హైదరాబాద్, మార్చి 6 : సంపద సృష్టికి తెలంగాణ చిరునామాగా మారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 వార్షిక బడ్జెట్లో మూలధన వ్యయం 11.2 శాతం మాత్రమే ఉండగా, ఇప్పుడు తెలంగాణలో 18.9 శాతానికి పెరిగింది. 2020-21లో మూలధన వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.61,443 కోట్లు ప్రతిపాదించింది. కరోనా కారణంగా ఇది 2019-20 కంటే 7 శాతం తకువే అయినా, గడిచిన వార్షిక సగటుతో పోలిస్తే వృద్ధిరేటు 31 శాతం. కరోనా కారణంగా మూలధన వ్యయాన్ని దేశం, ఇతర రాష్ట్రాలు గణనీయంగా తగ్గించినప్పటికీ తెలంగాణ సర్కారు రాజీ పడలేదు.
సాగులో మేటి
మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగింది. 60 లక్షల 54 వేల ఎకరాల్లో పత్తి సాగు చేసి దేశంలోనే అత్యధికంగా పత్తి పండిస్తున్న రెండో రాష్ట్రంగా అవతరించింది. రైతుబంధుకు 2020-21 బడ్జెట్లో రూ.14,800 కోట్లు కేటాయించింది. రైతుబీమా కింద 2020-21లో 32.73 లక్షల మంది రైతుల కోసం ఎల్ఐసీకి రూ.1,141కోట్లు చెల్లించింది. రుణమాఫీకి రూ.5,225 కోట్లు, సాగునీటి రంగానికి రూ.18,931 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో దేశంలో తెలంగాణ నంబర్1గా అవతరించింది. 2021-22లో జీఎస్డీపీ 11.20% వృద్ధి సాధించింది. ఇది ఆస్తుల కల్పన వల్లే సాధ్యపడిందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. తలసరి ఆదాయం పెరుగుదలలో నంబర్1గా ఎదగడానికీ ఆస్తుల కల్పనే కారణమని చెప్తున్నారు.
ప్రగతి దారులు
మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. 2020-21లో రోడ్లు, భవనాలశాఖకు రూ.8,788 కోట్లు ఖర్చు చేసింది. ఇది బడ్జెట్లో కేటాయించిన నిధులకంటే 150 శాతం ఎకువ. రాష్ట్రం ఏర్పాటుకు ముందు (2014) తెలంగాణలో 32 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 386కు చేరుకొన్నది. రూ.400 కోట్ల విలువైన 21 కొత్త ఓబీల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
ఆకాశమే హద్దుగా ఐటీ
ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచింది. ఇందు టీఎస్ ఐపాస్, టీఎస్‌బీపాస్ చట్టాలు మూల కారణం. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇవి ఎంతగానో దోహదం చేశాయి. నిరంతర విద్యుత్తు, సమర్థ ప్రభుత్వం, శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2013-14లో రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు కాగా, 2020-21 నాటికి రూ.1,45,522 కోట్లకు పెరిగింది. ఎగుమతుల విలువ ఏకంగా 154 శాతం పెరగటం విశేషం. ఈ రంగంలో 2013- 14లో రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 3,23,396 ఉండగా, 2020-21 నాటికి 8,28,615కు చేరుకొన్నది. దేశంలో కొత్తగా వచ్చిన ప్రతి పది ఐటీ ఉద్యోగాల్లో మూడు తెలంగాణ ఐటీ రంగమే కల్పించడం గమనార్హం.
విద్యుత్తు వినియోగంలో నంబర్ వన్
ఒక దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉన్నదని చెప్పే ప్రధాన సూచికల్లో తలసరి విద్యుత్తు వినియోగం ఒకటి. 2014-15లో తెలంగాణ రాష్ట్ర తలసరి విద్యుత్తు వినియోగం 1,346 కిలోవాట్లు ఉంటే, 2020-21 నాటికి 2,012 కిలోవాట్లకు పెరిగింది. తలసరి విద్యుత్తు వినియోగంలో 9.2 వృద్ధిరేటుతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. 2014-15లో మొత్తం విద్యుత్తు వినియోగం 39.519 మిలియన్ యూనిట్లు ఉండగా, 2020-21 నాటికి 57,006 మిలియన్ యూనిట్లకు పెరిగింది.