Congress | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): గత యాసంగికి ఎన్నికల కోడ్‌ను బూచిగాచూపి కాంగ్రెస్ నాయకులు రైతుబంధును అడ్డుకున్నారు. అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సా యం ఇవ్వకుండా జాప్యం చేశారు. దీంతో ఎలాగైనా వేసిన పంటలను కాపాడుకునేందుకు చిన్న, సన్నకారు రైతులు వడ్డీవ్యాపారుల వద్ద అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. తీరా సర్కా రు సాగునీరు అందించకపోవడంతో ఎక్కడి పంటలు అక్కడే ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. తీసుకున్న రుణం కట్టలేని దుస్థితిలో ఉన్న రైతుల నుంచి ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారులు ముక్కుపిండి మరీ అధికవడ్డీ వసూలు చేస్తున్నారు. అన్నదాతల నుంచి తాకట్టుపెట్టుకున్న పాస్‌బుక్కులు, బండ్లు, బంగారం వం టివి పూర్తిగా తమవద్దే ఉంచుకునే ప్రయత్నం చేశారు. ఈ దారుణాలన్నీ సాక్షాత్తూ ఇటీవల పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడ్డాయి.
ఎకరానికి రూ.15వేల రైతుభరోసా అందుతుందనే నమ్మకంతో అధిక వడ్డీ అయినా అప్పు చేసిన రైతులు ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. వ్యాపారులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి వడ్డీ, చక్రవడ్డీల పేరుతో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అప్పు కడతారో లేదోనని కొందరు వ్యాపారులు రైతులు తాకట్టుపెట్టిన పాస్బుక్కు లు, ఇంటి పత్రాలు, వాహనాలు, బంగా రం తమ పేరిట రాయించుకునే ప్రయత్నం చేశారు. వ్యాపారుల ఆగడాలు భరించలేక కొందరు రైతులు పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటివి ఎక్కువ నమోదు కావడంతో మల్టీజోన్-1 పరిధిలో ఐజీ రంగనాథ్ వడ్డీ వ్యాపారులపై ఏకకాలంలో దాడులు చేయించారు.
ఏప్రిల్‌లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు పెరిగాయని 16 జిల్లాల్లో ఇటీవల స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సోదాలు చేశారు. రూ.2,66, 12,070, కిలోన్నర బంగారం, 2,040 ప్రామిసరీనోట్లు, 677 చెక్కులు, 1,967 బాండ్ పేపర్లు, 92 పాస్‌బుక్కులు, 8 బైకులను స్వాధీనం చేసుకున్నారు.