హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పోలీస్ శాఖ పకడ్బందీ వ్యూహాలతో క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టింది. నేరాల అదుపునకు ఏర్పాటు చేసుకొన్న ఆధునిక వ్యవస్థలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో నిరుడితో పోలిస్తే గడిచిన ఆరు నెలల్లో తెలంగాణలో క్రైమ్ రేట్ నియంత్రణలోనే ఉన్నదని పోలీస్ ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. పోలీస్ శాఖ ఇటీవల ఆరు నెలల క్రైమ్ రేట్‌పై తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ రివ్యూలో గత ఆరునెలల్లో నమోదైన అన్ని నేరాల్లో తగ్గుదల కనిపించింది. డబ్బు కోసం చేసే కిరాయి హత్యలు ఈ ఆరు నెల్లలో 18 శాతం తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో లైంగికదాడులు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి.
2023 జనవరి నుంచి జూన్ 31 వరకు లైంగికదాడుల రేటు 10 శాతం తగ్గింది. ఇలాంటి దాడులు జరిగిన వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేయడం, విభిన్న కోణాల్లో ఆధారాలను సేకరించడం, కోర్టుకు సమర్పించి దుండగులకు శిక్షపడేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో ఆ ఆలోచన చేసేందుకే జంకుతున్నారు. వీటితో పాటు హత్యల రేటు కూడా 5 శాతం తగ్గడం శుభపరిణామమని పోలీసులు చెబుతున్నారు. రోడ్లపై నిరంతరం పోలీసులు గస్తీ పెంచడం, ఎమర్జెన్సీ కాల్స్‌కు తక్షణమే స్పందించడం, కేవలం 10 నిమిషాల్లోనే ఘటనా స్థలాలకు చేరుకొనే ఆధునిక వ్యవస్థను తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసుకోవడంతో దోపిడీలు సైతం 7 శాతం తగ్గుముఖం పట్టాయి.