Caste Survey | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కులగణన నివేదికపై సామాజికవేత్తలు, బీసీ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 46.25 శాతం మాత్రమే ఉందంటూ నివేదిక వెల్లడించడాన్ని తప్పుబడుతున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే తప్పులతడకగా కొనసాగిందని మండిపడుతున్నారు. 2023లో బీహార్‌లో చేపట్టిన కులగణన సర్వేలో బీసీల వాటా ఆ రాష్ట్ర జనాభాలో ఏకంగా 63.14 శాతంగా ఉన్నదని గుర్తుచేస్తున్నారు. అయితే, తెలంగాణలో మాత్రం ఇది 46.25 శాతానికి పరిమితం కావడమేంటని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లు అరకొర సమాచారాన్నే సేకరించారని, శాస్త్రీయత లేకుండా నిర్వహించిన ఈ సర్వేతో తెలంగాణలోని బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తెలంగాణలో బీసీల జనాభా 46.25 శాతమని, 10.08 శాతం ఉన్న ముస్లిం బీసీలను కలుపుకొంటే మొత్తం 56.33 శాతమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే.
బీహార్‌లో లెక్కలిలా..
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2023 జనవరిలో బీహార్‌లోని నితీశ్ సర్కారు కులగణన సర్వే చేపట్టింది. 2023 అక్టోబర్ 2న నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. రాష్ట్ర మొత్తం జనాభా 13,07,25,310గా తేలింది. అందులో ఓబీసీల జనాభా 3,54,63,936 (27.12 శాతం) కాగా ఈబీసీల జనాభా 4,70,80,514 (36.01 శాతం)గా లెక్కగట్టారు. మొత్తంగా రాష్ట్రంలో బీసీల జనాభా 8,25,44,450 (63.14 శాతం)గా తేల్చారు. అంటే బీహార్ రాష్ట్రంలోని ప్రతీ వందమందిలో 63 మంది బీసీలే. అయితే, తెలంగాణలోని కులగణన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతీ వందమందిలో 46 మంది మాత్రమే బీసీలుగా తేల్చారు. ఇదే బీసీ సంఘాల నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. ప్రతీ రాష్ట్రంలో బీసీల జనాభా శాతాల్లో ఒకట్రెండు అంకెలు తేడాలు ఉండొచ్చేమో గానీ.. బీహార్‌లో బీసీలతో పోలిస్తే, తెలంగాణ బీసీ జనాభా ఏకంగా 17 శాతం వరకూ వ్యత్యాసం ఉండటమేంటని నిలదీస్తున్నారు. తెలంగాణలో కులగణన సర్వే తప్పులతడకగా సాగిందని, ఈ సర్వేతో బీసీలకు కొత్త తిప్పలు మొదలైనట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీహార్ కులగణన (2023)