హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ తల్లి’ రూపా న్ని ఆమోదిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏటా డిసెంబర్ 9న అధికారికంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. తెలంగాణ తల్లి రూపాన్ని వక్రీకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరేలా చూపడం నిషేధించినట్టు జీవోలో ప్రభుత్వం పేర్కొన్నది.
అన్ని జిల్లా కేంద్రాల్లో విగ్రహాలు: పొన్నం
తెలంగాణ తల్లి విగ్రహాలను అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తొలుత కాంగ్రెస్ నేత సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పోరాట అంశాలను వివరించారు. ఏటా అవతరణ దినోత్సవాలను నిర్వహిస్తామని వెల్లడించారు.
ఏడాది పాలనను సమీక్షించుకోవాలి ; కూనంనేని సాంబశివరావు
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్వాగతించారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనలో అన్నిపక్షాల అభిప్రాయాలను, సాయుధ రైతాంగపోరాటం ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలిపారు. సెప్టెంబర్17ను కూడా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏడాది పాలనపై ప్రభుత్వం సమీక్షించుకోవాలని తెలిపారు.