నర్సాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి (Telangana Thalli) రూపురేఖలు మార్చినా ప్రభుత్వ అధికారులలో మాత్రం పాత తెలంగాణ తల్లి కావాలన్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేస్తారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఆవిర్భావ దినోత్సవం వరకు ఉద్యమకాలంలో రూపు దిద్దిన తెలంగాణ తల్లి చిత్రపటాన్ని పెట్టి ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం తెలంగాణ తల్లి విగ్రహ రూపు రేఖలు మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ తల్లికి సంబంధించి గెజిట్ కూడా విడుదల చేసింది. దీంతో ఏడాది జరుపుకొనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో అన్నిచోట్లా ప్రభుత్వం ఆమోదించిన తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేయడం జరిగింది.
కానీ దీనికి విరుద్ధంగా నర్సాపూర్ (Narsapur) మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద అధికారులు, సిబ్బంది పాత తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఉంచి జెండా ఆవిష్కరణ చేసి పూలమాలలు వేశారు. ప్రతి కార్యాలయం వద్ద కొత్త తెలంగాణ తల్లి చిత్రపటం ఉండగా ఒక్క ఎంఈఓ కార్యాలయం వద్ద మాత్రమే పాత తెలంగాణ తల్లి చిత్రపటం ఉంచడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తుండగా సమాచారం అందుకున్న ఎంఈఓ అక్కడకు చేరుకొని తెలంగాణ తల్లి చిత్రపటాన్ని తీసి వేయించారు. అయితే ఆ స్థానంలో కొత్త తెలంగాణ తల్లి చిత్రపటం ఉంచకపోవడం గమనార్హం. పాత తెలంగాణ తల్లి రూపురేఖలు జనం మదిలో నుంచి ఇంకా తొలగిపోలేదని చెప్పడానికి ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.