హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జూన్ 2న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న రూపానికి మార్పులు, చేర్పులు చేసి కొత్త విగ్రహాన్ని తయారు చేయించింది. దీంతోపాటు మార్పులు చేసిన అధికారిక చిహ్నాన్ని, రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ పాటను విడుదల చేయనున్నట్టు సమాచారం. వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించనున్నారు. ఆమె చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నదని, పలువురు ఉద్యమకారులను సన్మానించేందుకు జాబితాను సైతం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే వేదిక మీదుగా అమరవీరుల కుటుంబాలకు స్థలం, పెన్షన్ ఇచ్చే పథకాన్ని ప్రకటించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.
వేడుకలకు పటిష్ట భద్రత
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం వివిధ శాఖలతో ఆమె సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకల నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా గన్పార్ను సందర్శించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై సీఎస్ దిశానిర్దేశం చేశారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పారింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని, రోడ్డుకు ఇరువైపులా జెండాలతో అలంకరించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. నిరంతరాయం గా విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖను ఆదేశించారు. కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, ఎస్సీఎస్ అధర్ సిన్హా, ముఖ్య కార్యదర్శులు బి వెంకటేశం, జితేందర్, కార్యదర్శులు క్రిస్టినా జోంగ్తు తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.