Telangana | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): సచివాలయ ప్రాంగణంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిషరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దసరా వరకు మంచి రోజులు లేకపోవడంతో భూమిపూజ ముందుగా చేస్తున్నామని వివరించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేరళ పర్యటనలో ఉండటం, మంత్రులకు ఇతర కార్యక్రమాలు ఉండటంతో హాజరుకాలేదని తెలిపారు. రాష్ట్ర పాలనకు సంబంధించిన నిర్ణయాలన్నీ ఇక్కడే జరుగుతాయని అందుకే సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు
చేస్తున్నామని చెప్పారు. ప్రజల అభిమతానికి తగినట్టు తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించే బాధ్యతను జేఎన్టీయూ ఫైన్ఆర్ట్స్ విభాగం కళాశాల ప్రిన్సిపాల్‌కు అప్పగించామని వెల్లడించారు.
నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్ చుట్టుపకల దేశం, రాష్ట్రం కోసం ఎంతో చేసిన అంబేద్కర్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, అంజయ్య, కాకా వెంకటస్వామి విగ్రహాలు, జైపాల్‌రెడ్డి సమాధి ఉన్నాయని, వీటిమధ్య రాజీవ్‌గాంధీ విగ్రహం లేకపోవడం లోటుగా కనిపించిందని అన్నారు. అందుకే సచివాలయం ఎదుట మేధావుల సూచన మేరకు రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.