KTR | కాంగ్రెస్ చేతగాని పాలనతో రాష్ట్రం ఆగం అవుతోందని.. ఏడాది పాలనలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని.. నాలుగేళ్ల పాలనతో తెలంగాణ ఏమవుతుందోనని ఆవేదన కలుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు కేటీఆర్ సోమవారం బహిరంగ లేఖ రాశారు. ‘రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు మీ పాలన మొదలు కాగానే ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రతి వర్గాన్ని రోడ్డెక్కించారు. కంపెనీలు తరలిపోతున్నాయి. రాష్ట్ర ఆదాయం తగ్గిపోతోంది. పాలన అనుభవం లేని బ్లాక్ మెయిలింగ్ ముఖ్యమంత్రితో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌లో నిరసనలు చేసేందుకు వీలు లేకుండా ఆంక్షలు పెట్టే దుస్థితి మీ ప్రభుత్వానిది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం అంచనా వేయకుండా నేల విడిచి మీరు చేసిన సాము కారణంగా తెలంగాణ భవిష్యత్ తలకిందులుగా మారింది. తీరా చేయాల్సిన అన్యాయమంతా చేసి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జు ఖర్గే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మించి హామీలు ఇస్తే ఆ రాష్ట్రం దివాళా తీస్తుందని స్వయంగా మీ పార్టీ అధ్యక్షుల వారే నొక్కి వక్కాలిస్తున్నారు’ మండిపడ్డారు.
‘అధికారమే పరమావధిగా బొచ్చెడు హామీలు ఇచ్చిన పాపంలో మీరే ప్రధాన భాగస్వాములు. ఇప్పుడు అందుకు క్షమాపణలు చెబుతారా రాహుల్ గాంధీ గారు. దొరికిందే అవకాశమని ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణను అడ్డగోలుగా దోచుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. ఎవరి ట్యాక్స్ వాళ్లకు కట్టే పరిస్థితి తెచ్చారు. మీ ముఖ్యమంత్రి బహిరంగంగానే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కుంభకోణాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారు. ఇది చాలదన్నట్లుగా కొడితే ఏనుగు కుంభస్థలం అన్నట్లు మూసీ ప్రాజెక్ట్ తెరపైకి తెచ్చారు. రూ.1.50లక్షల కోట్లతో చేపడుతామంటున్న ఈ ప్రాజెక్ట్ ఎవరి ప్రయోజనాల కోసమో? ఈ మొత్తం సొమ్ములో ఢిల్లీ వాటా ఎంత? పేదల కడుపు కొట్టి వేల కోట్ల రూపాయలు జేబులో వేసుకొని ఈ ప్రాజెక్ట్ కు మీ ఆమోదం లేకుండానే జరుగుతోందా? మీ మోసం, నయవంచన ఒక్క ప్రజలతోనే ఆగిపోలేదు. మిమ్మల్ని మీరు కూడా మోసం చేసుకుంటున్న తీరు చూస్తుంటే మీపై సానుభూతి కలుగుతోంది. పార్టీ ఫిరాయింపులు చేస్తే తక్షణమే వేటు పడేలా చట్టం అంటూ తెలంగాణలో ఫోజులు కొట్టారు’ కేటీఆర్ విమర్శించారు.
‘అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సీఎం అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంటే.. తోలుకుట్టిన దొంగలా సైలెంట్ అయ్యారు. రాజ్యాంగాన్ని కాపాడుతానంటూ రాజ్యాంగ ప్రతి పట్టుకొని తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతుంటే మౌన ముని అయిపోయారు. అదానీ విషయంలో మీ హిప్పోక్రసీ చూసిన తర్వాత నవ్వాలో.. ఏడవాలో తెలియని దుస్థితి. ఓ వైపు మోదీ, అదానీని కలిపి మోదానీ అంటారు. మరోవైపు తెలంగాణలో దోస్తానా చేస్తారు. సిగ్గు కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడే పరిస్థితి. మొత్తంగా ఏడాది కూడా తిరగకముందే కాంగ్రెస్ నాయకులు రోడ్లపై తిరగలేని దుస్థితి తీసుకొచ్చారు. మా తెలంగాణ ఆగమయ్యేందుకు ప్రధాన కారణం మీరే. కనుక సూటిగా మిమ్మల్నే ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పండి. ఇచ్చిన హమీలు నెరవెర్చకుండా సబ్బండ వర్గాలను మోసం చేసిన మీరు, అభివృద్ధి పథంలో ఉన్న తెలంగాణను అవీనీతి తెలంగాణాగా మార్చినందుకు యావత్తు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి’ అంటూ డిమాండ్ చేశారు.