హైదరాబాద్, నవంబర్ 29: మన రాజధాని హైదరాబాద్ మటన్ బిర్యానీకి మషూర్. ఇక తెలంగాణ ప్రజలకు ముక్క మీద ఉండే మక్కువ గురించి తెలిసిందే. సుమారు 99 శాతం మంది మాంసప్రియులేనని తాజా గణాంకాలు చెప్తున్నాయి. స్వరాష్ట్రం వచ్చాక మాంసం ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. తలసరి వినియోగం దాదాపుగా రెట్టింపైంది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి ఉండేలా చూసేందుకు, ముఖ్యంగా దిగుమతులను పూర్తిగా తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాగల ఐదేండ్లలో మాంసం ఉత్పత్తిని 60% పెంచాలని ప్రణాళికలు వేసింది. మాంసం ఉత్పత్తిలో తెలంగాణ ప్రస్తుతం దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ రాష్ట్ర గణాంకాల హ్యాండ్‌బుక్ వెల్లడించింది. ఇక మరో 60% పెంచితే ఏ స్థానంలో ఉంటుందో ఊహించుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం మాంసం ఉత్పత్తిలో గొర్రెలు (32%), మేకల (8%) వాటా కలిపితే 40 శాతం వరకు ఉంటుంది.
రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరగడంలో గొర్రెల పంపిణీ పథకం ముఖ్యపాత్ర పోషిస్తున్నది. 2017 జూన్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ ప్రతిష్ఠాత్మక పథకంతో నాలుగేండ్లలో మాంసం ఉత్పత్తిఉ 7.54 లక్షల టన్నుల నుంచి 10.5 లక్షలకు పెరిగింది. స్థానిక డిమాండ్ కారణంగా ప్రస్తుతానికి ఎగుమతి చేసే అవకాశం లేనప్పటికీ, రెండేండ్లలో దిగుమతి మాత్రం 80% తగ్గిందని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ రామచందర్ తెలిపారు. ఇదివరకు 500 పైచిలుకు లారీల్లో గొర్రెలు, మేకలు రాష్ర్టానికి దిగుమతి అయ్యేవని, ప్రస్తుతం 90 లారీలే వల్తున్నాయని వివరించారు. గొర్రెల పంపిణీతో కొత్తగా రూ.7,920 కోట్ల సంపద పెరిగిందని చెప్పారు. ఇక మాంసం వినియోగంలోనూ తెలంగాణ అంచెలంచెలుగా వృద్ది సాధిస్తున్నది. ఈ ఎనిమిదేండ్లలో హిందూ మాంసాహారుల్లో పురుషుల సంఖ్య 44.4 శాతం నుంచి 52.5 శాతానికి, మహిళల సంఖ్య 38.3 శాతం నుంచి 40.7 శాతానికి పెరిగాయి. ఆ మాటకు వస్తే భారతదేశంలోనూ 70 శాతం మంది మాంసాహారులేనని సర్వేలో తేలింది. మాంసం వినియోగంలో రాష్ట్రాల్లో తెలంగాణ 98.70 శాతంతో ఒకటో స్థానంలో ఉంది. 98.55 శాతంతో బెంగాల్ రెండో స్థానంలో, 98.25 శాతంతో ఏపీ మూడో స్థానంలో ఉంది. మూడు రాష్ర్టాల మధ్య తేడా పెద్దగా లేకపోవడం గమనార్హం.