హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల గోదావరి వరద జలాలను ఉపయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మిస్తామని, అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతితో పాటు నిధులను కూడా సమకూర్చాలని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. గోదావరిపై పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులకు బచావత్ ట్రిబ్యునల్ అనుమతులు ఇచ్చిందని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సమకూర్చుతున్న నేపథ్యంలో అంతే సమానంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టుకూ నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా, గోదావరి నదీ బేసిన్లలో సమస్యల పరిష్కారానికి కేంద్రం వెంటనే చొరవ చూపాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు సోమవారం లేఖ రాశారు.
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు డీపీఆర్‌లను కేంద్ర జల సంఘం ఆమోదానికి, ఈసీ జారీకి పర్యావరణ శాఖకు సిఫార్సు చేయాలని, అనుమతులు వస్తే ఆర్థిక సంస్థల నుంచి తకువ వడ్డీతో రుణాలు పొందే వీలు ఉంటుందని వెల్లడించారు. 2007లోనే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ ఆమోదం పొందిందని, ఆ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని ప్రధాన మంత్రి కార్యాలయం 2010 డిసెంబర్ 10నే ప్రతిపాదించిందని గుర్తుచేశారు. ఛత్తీస్‌గఢ్ ఎన్వోసీ ఇవ్వకపోవడంతో సమ్మక సాగర్ ప్రాజెక్ట్‌కు అనుమతుల మంజూరు జాప్యమవుతున్నదని, ముంపు విషయంలో ఖరగ్‌పూర్ ఐఐటీ సిఫారసులను పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కృష్ణా బేసిన్లో శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు ఏపీ అక్రమంగా నీటిని మళ్లిస్తున్నదని, ఏకంగా 8 టీఎంసీలను మళ్లించేలా కాల్వల విస్తరణ చేపట్టిందని, దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ మీద ఆధారపడ్డ జల విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభావం పడడమేగాక, తెలంగాణ ఇన్-బేసిన్ అవసరాలకు విఘాతం కలుగుతున్నదని వివరించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇతర బేసిన్లకు ఏపీ నీటిని మళ్లించడాన్ని కేఆర్ఎంబీ అడ్డుకోవాలని, టెలిమెట్రీ అమలు చేయాలని కోరారు. శ్రీశైలం డ్యామ్ ప్రమాదకరంగా మారిందని, వెంటనే మరమ్మతులు చేపట్టేలా చూడాలని కోరారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌లో తమ్మిడిహట్టి వద్ద 20 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మాణానికి ఏఐబీపీ కింద ఆర్థికసాయం అందించాలని, ఇప్పుడున్న 20 టీఎంసీల కేటాయింపులను 80 టీఎంసీలకు పెంచాలని కోరారు. ఇచ్చంపల్లి నుంచి కావేరికి 148 టీఎంసీల నీటి బదిలీలో 50 శాతం తెలంగాణకు ఇవ్వాలని ఎన్‌డబ్ల్యూడీఏ 2024 మార్చిలో లేఖ రాసిందని గుర్తుచేశారు.