హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్య పనితీరులో తెలంగాణ రాష్ట్రం వెనుకబడింది. మొత్తం 1,000 మార్కులకు రాష్ట్రం కేవలం 511.9 మార్కులనే సాధించింది. 11-20 శాతంలోపు స్కోర్‌నే సాధించి, మరో 18 రాష్ర్టాల సరసన నిలిచింది. ఈ విషయం 2023- 24 సంవత్సరం ఫెర్ఫార్మెన్స్ గ్రేడెడ్ ఇండెక్స్ (పీజీఐ) నివేదికలో వెలుగుచూసింది. తెలంగాణ మొత్తం 73 సూచికల్లో వెయ్యి మార్కులకుగాను దీనిని రూపొందించారు. అభ్యాస ఫలితాలు, నాణ్యత, పాఠశాలలు, టీచర్ల లభ్యత, మౌలిక సదుపాయాలు, ఈక్విటీ, గవర్నెన్స్, టీచర్ ఎడ్యుకేషన్- ట్రైనింగ్ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచీని రూపొందించారు.
తెలంగాణ ఆకాంక్షి-2 గ్రేడ్‌ను సొంతం చేసుకున్నది. ఈ సూచీలో 91-100 శాతం మధ్య మార్కులు సాధించిన రాష్ర్టాలకు దక్ష్, 90-81 మార్కులు సాధించిన జిల్లాలకు ఉత్కర్ష్, 80-71 శాతం మార్కులు సాధించిన జిల్లాలకు అతి ఉత్తమ్, 70-61 శాతం మార్కులు సాధించిన జిల్లాలకు ఉత్తమ్, 60-51 మార్కులకు ప్రచేస్త్ర-1, 50-41 మార్కులు సాధించిన జిల్లాలకు ప్రచేస్త్ర-2 గ్రేడ్లను జారీ చేశారు.
31-40 శాతంలోపు స్కోర్‌కు ప్రచేస్త్ర-3, 21-30 శాతం లోపు ఆకాంక్షి-1, 11-20 శాతం లోపు ఆకాంక్షి-2, 10 శాతం లోపు సాధించిన రాష్ర్టాలకు ఆకాంక్షి-3 గ్రేడ్లను ఇస్తున్నారు. తెలంగాణతోపాటు 14 రాష్ర్టాలు ఆకాంక్షి-1 గ్రేడ్ సాధించాయి. 2022-23లో తెలంగాణ 489.3 స్కోర్ సాధిస్తే ఈసారి 511.9 స్కోర్ సాధించింది. రాష్ట్రంలోని 25 జిల్లాలు ప్రచేస్త్ర-2లో నిలువగా, 8 జిల్లాలు ప్రచేస్త్ర-3లో నిలిచాయి.