10th Exams | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని తీసుకువచ్చేందుకు యోచిస్తున్నది. ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలను మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. దీంతో ఒకేసారి సిలబస్ మొత్తం చదివి పరీక్షలు రాయాల్సి రావడంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో పిల్లలపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆరు నెలలకోసారి పరీక్షలు పెడితే ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తున్నది. సెమిస్టర్ విధానంపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నది. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఈ నెల 2న ఖమ్మం జిల్లా కుసుమంచి, జీళ్ల చెరువు హైస్కూళ్లను సందర్శించిన సందర్భంలో ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.