Khammam | ఖమ్మం, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/తిరుమలాయపాలెం : ఖమ్మం జిల్లాలో 20 ఏండ్లలో ఎన్నడూ పడనంతగా భారీ వర్షం పడింది. ఖమ్మం జిల్లా చరిత్రలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. కూసుమంచి మండలంలో అత్యధికంగా 31.5 సెం.మీ., మధిర 28.38 సెం.మీ, తిరుమలాయపాలెం 26.3 సెం.మీ, చింతకాని 26.22 సెం.మీ, వైరా 24.76 సెం.మీ, ఎర్రుపాలెం 24.76 సెం.మీ వర్షపాతం నమోదైంది.
భారీ వర్షానికితోడు ఎగువ నుంచి వచ్చే వరదతో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చి జలప్రళయం సృష్టించింది. పాలకుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో మున్నేరు నది పరీవాహక ప్రాంతాలైన బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్, మాణిక్యనగర్, గణేశ్‌నగర్, మోతీనగర్, మంచికంటినగర్, దానవాయిగూడెం కాలనీ, ధంసలాపురం కాలనీలోని బడుగు జీవులు బజారున పడ్డారు.
శనివారం రాత్రి ఒక్కసారిగా వచ్చిన భారీ వరదతో ఖమ్మం నగరంలో ప్రజలు కట్టుబట్టలతో ఇల్లు వదిలారు. బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి తలదాచుకున్నారు. ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో కొందరే ఉన్నారు. 24 గంటలు గడిచినా పాలకులు, జిల్లా యంత్రాంగం వారికి తినడానికి తిండి, తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా అందించలేదు. అక్కడక్కడా స్వచ్ఛంద సంస్థలు ముంపు బాధితులను ఆదుకున్నాయి.
మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో బురదతో నిండిన ఇంటిని, నీటిలో మునిగిన వస్తువులు, వాహనాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రతి ఇంటికి కనీసం రూ.2లక్షల ఆస్తినష్టం జరిగింది. పస్తులతోనే ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే నిరుడు కూడా మున్నేరు 32 అడుగుల మేర ప్రవహించింది. అయితే అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లనే భారీ ఆస్తి నష్టం జరిగింది. దీంతో తమ ప్రాంతాలకు వస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలో ప్రవహించే ఆకేరు వాగు ఉధృతికి అన్నదాతలు కన్నీటిసంద్రంలో మునిగిపోయారు. హైదర్‌సాయిపేట-ధర్మారం బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. అజ్మీరాతండా, తిప్పారెడ్డిగూడెం, తిరుమలాయపాలెం సమీపంలోని ఆకేరు బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 1,770 ఎకరాల్లో వరి, 1,470 ఎకరాల్లో పత్తి, 505 ఎకరాల్లో మిరప పంటలకు నష్టం జరిగినట్టు మండల వ్యవసాయాధికారి సీతారామరెడ్డి తెలిపారు. ఆకేరు ప్రవాహంతో రాకాశితండా నీటమునిగింది. గ్రామంలో రెండు ఇళ్లు కొట్టుకుపోగా, మరో 10 ఇళ్లు దెబ్బతిన్నాయి. గ్రామంలో పర్యటించిన అధికారులు ఐకేపీ ద్వారా భోజనాలు అందించి చేతులు దులుపుకున్నారు. వైద్యసిబ్బంది శిబిరాన్ని ఏర్పాటు చేశారు.మంత్రులెవ్వరూ రాకపోవడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/పుల్కల్: రైతులకు నీరందించే సీతారామ కాలువకు గండి పడింది. సీతారామ కాలువను ఇటీవలె సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ములకలపల్లి మండలం కమలాపురం పంప్‌హౌస్ వద్ద కాలువకు భారీగా నీరు చేరడంతో ముందుగానే అధికారులు గండికొట్టే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. వరద ఉధృతికి కాలువ కోతకు గురికావడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న పంట పొలాలకు కాలువలో నీరు ప్రవహించాయి. సుమారు 50 ఎకరాల పంట నష్టం జరిగింది. అలాగే సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టు కాలువ తెగిపోయింది. ఏకధాటిగా వర్షాలకు ఇసోజిపేట శివారులోని సింగూరు కెనాల్ కాలువలోకి వరద భారీగా వచ్చి తెగింది. గడిచిన మూడేండ్లలో ఈ కాలువ ఐదుసార్లు తెగింది.
పోయిన ఏడాది వరదలు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఆయనే మా దేవుడు. ఆయన వెంటనే పువ్వాడ అజయ్‌కుమార్‌ను పంపి మాకు అండగా ఉంచారు. ఎలాంటి ప్రాణ నష్టం కాదు కదా.. కనీసం ఆస్తి నష్టం జరగలేదు. నిరుడు వరదలు వస్తాయని ముందే చెప్పడంతో మా సరుకులు, వస్తువులను ట్రాక్టర్లలో తీసుకెళ్లి నయాబజార్ కళాశాలలో ఉంచాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వరదలు వస్తాయని ఏ ఒకరూ చెప్పలేదు. మాకు జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు?
– నాళం విజయలక్ష్మి, ఖమ్మం
ఖమ్మం ఎమ్మెల్యేగా అజయ్‌కుమార్ ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. నిరుడు వరదలు వస్తే మా తోటే ఉండి మాతోటే తిన్నాడు. నాయకుడు అంటే అలా ఉండాలి. ఇప్పుడు మమ్ముల్ని పట్టించుకునేవాడే లేడు. రాత్రిపూట వరద వస్తుందని చెప్పినట్లయితే మా ఆస్తులను పోగొట్టుకునే వాళ్లం కాదు. అధికారులు, నాయకులు నష్టం జరిగాక వచ్చి ఫొటోలుకు ఫోజులు ఇవ్వడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఇప్పుడు మమ్ముల్ని కాపాడేది ఎవరు.
– జ్యోతి, చంటి పాప తల్లి, ఖమ్మం