హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాల్లో సందడి నెలకొన్నది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత ఎన్నికలకు ఎస్ఈసీ అధికారులు గురువారం నోటిఫికేషన్ జారీచేయన్నారు. అదే సమయంలో తొలి విడతలో ఎన్నికలు జరిగే 189 మండలాల్లోని 4,236 గ్రామాల్లో ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నారు. నోటిఫికేషన్ వెలువడటంతోనే నామినేషన్ల దాఖలు ప్రక్రి య మొదలుకానున్నది. రిటర్నింగ్ అధికారులు గురువారం ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన, సాయం త్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ప్రకటించనున్నారు.
పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎక్కడ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సజావుగా సాగాలే చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అధికారులను ఆదేశించారు. ఎస్ఈసీ కార్యాలయం నుంచి గురువారం మధ్యాహ్నం పంచాయతీ ఎన్నికల సన్నాహాలపై జిల్లాల కలెక్టర్లు/డీఈఏలు, సీపీలు/ఎస్పీలు, ఇతర సీనియర్ అధికారులు, జిల్లా యంత్రాంగంతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి దశకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు. అన్ని అధికార పరిధిలో ఎన్నికల నియమావళి అమలు, శాంతిభద్రతల పర్యవేక్షణపై పలుసూచనలు చేశారు.