హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఒకవైపు పెద్దఎత్తున పంట మార్పిడి చేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టిసారించి ఆర్థికంగా ఎదగాలని చెప్తూనే.. ఆయా రంగాలకు రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నది. దీంతో ప్రభుత్వం చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించిన నిధుల వల్ల ఆయా శాఖల ప్రగతిపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్లో కేవలం ఉద్యానశాఖకు రూ.737 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ ఏడాది రాష్ట్రంలో దాదాపు లక్ష ఎకరాల్లో కూరగాయల సాగు విస్తరించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. అంతేకాకుండా 2 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ కల్పించాలని భావిస్తున్నది. వీటితోపాటు రాష్ట్రంలో పండ్ల తోటల విస్తీర్ణం, గ్రీన్హౌస్ సాగును ప్రోత్సహిస్తామని ప్రకటించింది. అయితే బడ్జెట్లో కేటాయించిన రూ.737 కోట్లతో వీటిని ఎలా అమలు చేస్తారనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించి వేల ఎకరాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. లక్ష ఎకరాల కూరగాయల సాగుకు ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.40 వేల వరకు అవసరం ఉన్నది. ఈ మేరకు దాదాపు కూరగాయల సాగుకే రూ.400 కోట్లు అవసరమవుతాయి. వీటితోపాటు 2 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్కు దాదాపు దాదాపు రూ.600 కోట్లు అవసరం కానున్నాయి. దీంతో బడ్జెట్లో కేటాయింపులు ఆ మేరకు లేకపోవడంతో అధికారులు లక్ష్యాలకు ఏలా చేరుతారనే పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
బడ్జెట్లో నిరుడుతో పోలిస్తే మత్స్య, పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే రూ.145 కోట్లు తక్కువ. దీంతో ఈ కేటాయింపులు పశుసంవర్ధక, మత్స్యశాఖల అభివృద్ధికి తీవ్ర నిరాశను కలిగించిందని ఆయా రంగాలకు చెందిన రైతులు, అధికారులు వాపోతున్నారు. మత్స్యశాఖ నిరుడు ఉచిత చేపపిల్లల పంపిణీ, మత్స్యకారులకు సబ్సిడీ కింద వాహనాల అందజేత కార్యక్రమాలను చేపట్టింది.
అయితే ఈ బడ్జెట్లో నిధుల్లో కోత కారణంగా కార్యక్రమాలు ముందుకు సాగేలా కనిపించడం లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం చేపట్టిన ఉచిత గొర్రెలు, చేప, రొయ్య పిల్లల పంపిణీపై కూడా ఈ బడ్జెట్లో స్పష్టత లేకపోవడంతో వీటి పంపిణీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన లబ్ధిదారులకు నిరాశ తప్పేలా లేదు. అంతేకాకుండా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులను పరిశీలిస్తే ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మాత్రమే కేటాయించినట్టు కనిపిస్తున్నదని నిపుణులు పేర్కొంటున్నారు.