హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): బీజేపీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఇందుకు నేడు(ఆదివారం) నోటిఫికేషన్ విడుదల కానుంది. సోమవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. జూలై 1న ఎన్నిక నిర్వహించనున్నారు. అదేరోజు కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి శోభా కరంద్లాజే సోమవారం రాష్ర్టానికి రానున్నారు. అధిష్ఠానం సూచించిన నేతల వద్ద నామినేషన్లు స్వీకరించనున్నారు. మరోవైపు అమిత్‌షా సైతం నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ పదవి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈటల, అరవింద్‌కు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.