హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా 18న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను అసెంబ్లీ ఎదురుగా అమరువీరుల స్థూపం వద్ద జేఏసీ నేతలతో కలిసి సోమవారం ఆవిష్కరించారు.
బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని బీసీ శక్తిని చాటిచెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, కో చైర్మన్లు రాజారాం యాదవ్, దాసు సురేశ్, మీడియా కో ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.