హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో పాత ఆటో పర్మిట్ల స్థానంలోనే ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్ల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. కొత్త ఆటోలపై 50 శాతం రాయితీతో బ్యాంకు రుణసదుపాయం కల్పించాలని జేఏసీ నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్ల జేఏసీ నేతలు హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు, బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్ మాట్లాడుతూ తెలంగాణలో ఆటోడ్రైవర్లు ఉపాధిలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు. కొత్త ఆటోల పర్మిట్లు ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. కొత్తగా కొందరు పెద్దలు ఆటోపర్మిట్ల పేరుతో అక్రమ దందాకు తెరలేపారని టీఏడీయూ నాయకుడు కొమురయ్య, టీఏడీయూ నాయకుడు కొమురయ్య ఆరోపించారు. ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలను ఆపాల్సిన బాధ్యతను మరిచి.. పర్మిట్ల దందా చేపట్టడమేంటని నిలదీశారు. కార్యక్రమంలో టీఆర్ఏకేటీయూ ఈశ్వర్, హబీబ్, పెంటయ్యగౌడ్, కిషన్, వజ్రలింగం, అశ్విన్‌రాజ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.