హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలను 2026 మార్చి 18 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. షెడ్యూల్నుప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 18వ తేదీనే ముగియనున్నాయి. అదే తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభించేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. అయితే పరీక్షల మధ్యలో శ్రీరామనవమి వస్తున్నది. మార్చి 26, 27 తేదీల్లో ఏ తేదీన శ్రీరామనవమి సెలవు ఉంటుందన్నది తేలలేదు. ప్రభు త్వం సెలవుల జీవోను విడుదల చేస్తే ఈ అంశంపై స్పష్టతరానున్నది. ఒకటి, రెండు రోజుల్లో వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును మరో పది రోజులు పొడిగించాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మామాస్టర్స్ అసోసియేషన్ (టీజీహెచ్ఎంఏ) కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు రాజభానుచంద్రప్రకాశ్, ప్రధానకార్యదర్శి హేమచంద్రుడు బుధవారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫీజు చెల్లింపు గడువు గురువారంతో ముగియనున్నది. అయితే వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫీజు చెల్లించలేని పరిస్థితులున్నాయి. దీంతో గడువును 10 రోజులపాటు పొడిగించాలని వారు కోరారు.