Anjaneya Goud | రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే వెనక సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తున్నాయేకానీ బీసీలకు ఒరిగే లాభాలేవీ ఉండేలా లేవని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సర్వే అనేక అనుమానాలకు ఆస్కారం కల్పించేలా ఉందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ద్వారా గానీ, బీసీ కమిషన్ చట్టాన్ని సవరించి గానీ, పూర్తి అధికారాలిచ్చి కమిషన్కు న్యాయబద్దత కల్పించడం ద్వారా శాస్త్రీయ సర్వేకు మార్గం చూపకుండా, ప్రభుత్వమే గందరగోళం స్రృష్టిస్తున్నదని ఆరోపించారు.
కర్ణాటకలో మాదిరిగా బీసీ కమిషన్ కు అధికారాలు కల్పిస్తే, ప్రణాళికా విభాగాన్ని నోడల్ ఏజన్సీగా నియమించుకొని కమిషన్ న్యాయబద్ధమైన, గణించదగిన డేటాను సేకరిస్తుందని ఆంజనేయ గౌడ్ పేర్కొన్నారు. కానీ 199,47,18 జీవోల మధ్య స్పష్టత లేకపోవడంవల్ల సర్కార్ చేపడుతున్న సర్వే దేని కోసమో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేను కావాలనే న్యాయపర సమస్యల్లోకి నెట్టేలా నిర్వహిస్తున్నదన్నారు. ఒంటిపూట బడుల తర్వాత, ప్రాథమికోపాధ్యాయులు ఇండ్లలో ఎవరూ ఉండని మధ్యాహ్నం వేళల్లో, ఏ సమాచారం సేకరిస్తారని ప్రశ్నించారు. పైగా ఏ ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా, వాస్తవ సమాచార సేకరణ చేయల్సిన సర్వే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ జోక్యం దేని కోసమని ప్రశ్నించారు.
అసలు ఇంటింటి సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నదా, కాంగ్రెస్ పార్టీ చేపడుతుందా అని ఆంజనేయ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. సర్కార్ కసరత్తును కాంగ్రెస్ సర్కస్ గా నిర్వహించాలనుకోవడం దారుణమన్నారు. హస్తం పార్టీ నేతల జోక్యం వల్ల గ్రామాల్లో సర్వే ప్రభావితమై, సామాజిక వర్గాల లెక్కలు తలకిందులయ్యే ప్రమాదముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల గణన కోసం ఈ నెల ఐదో తేదీవివిధ వర్గాలతో సమావేశం కావడానికి రాహుల్ గాంధీ ఎవరని, రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకున్న బాధ్యతలేంటని ప్రశ్నించారు.
ఇదే పధ్ధతిలో ప్రభుత్వం కులాలు, కుటుంబాల వివరాలు సేకరిస్తే, బీసీలకు తీరని ద్రోహం జరగడం ఖాయమని ఆంజనేయ గౌడ్ తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ కులగణను కుట్రగణనగా మార్చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కోర్టు తీర్పులను, విపక్షాల సూచనలను గమనంలోకి తీసుకొని సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే నిర్వహించాలని ఆంజనేయ గౌడ్ డిమాండ్ చేశారు.