హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. వారు బీఆర్ఎస్ పార్టీ మారారనేందుకు సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు వారిద్దరికీ స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చారు. బీఆర్ఎస్ తరఫున కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారంటూ కాలె యాదయ్య మీద బీఆర్ఎస్ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి మీద సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వారిపై పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే, విచారణ జరిపిన స్పీకర్.. సదరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య బీఆర్ఎస్లోనే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలోకి మారినట్టు సరైన ఆధారాలు చూపించనందున వారిపై ఇచ్చిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు స్పష్టంచేశారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గురువారం ప్రకటన జారీచేశారు. గతంలో కూడా పార్టీ ఫిరాయింపు కేసులో ఐదుగురు ఎమ్మెల్యేలు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కు సంబంధించిన ఫిరాయింపు కేసుల విచారణ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది.