హైదరాబాద్: ప్రతి ఏటా రాష్ట్ర సామాజిక ఆర్థిక ప్రగతిని ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈసారి కూడా వివిధ రంగాల్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరిస్తూ సోషియో ఎకనమిక్ ఔట్‌లుక్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగ కల్పనలో జాతీయ సగటును మించి రాష్ట్రం సాధించిన ప్రగతిని ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉద్యోగాలను సృష్టించే వృద్దే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి కీలకమైన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్ఎఫ్పీఆర్) తెలంగాణలో 55.1 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు (50.2 శాతం) కంటే చాలా ఎక్కువ.
ఇందులోనూ మహిళా సాధికారతలో తెలంగాణ సాధించిన వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా ఎల్ఎఫ్పీఆర్లో జాతీయ సగటు 24.5 శాతం కాగా.. తెలంగాణ సగటు 38.3 శాతంగా ఉండటం గమనార్హం. ఇక ఉద్యోగ నాణ్యత విషయంలోనూ తెలంగాణ ఉత్తమంగా నిలిచింది. రాష్ట్రంలోని మొత్తం ఉద్యోగాలు చేసే వ్యక్తుల్లో 27 శాతం మంది జీతం ఉన్న ఉద్యోగం చేస్తున్నారు. ఇందులో జాతీయ సగటు 23.8 శాతం మాత్రమే. నిజానికి గతేడాది కొవిడ్ వల్ల తెలంగాణ వృద్ధి మందగించినా.. దేశ పరిస్థితితో పోలిస్తే రాష్ట్రం మెరుగ్గానే ఉంది.