హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ)/జహీరాబాద్/నారాయణఖేడ్ : మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌పై జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావుకు, సంతోష్‌కుమార్‌కు అండగా ఉంటామని చెప్పారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న హరీశ్‌రావు, సంతోష్‌పై కవిత చేసిన ఆరోపణలను మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తప్పుబట్టారు. నాడు ఉద్యమంలో, పాలనలో, నేడు ప్రతిపక్షంలోనూ హరీశ్‌రావు అనునిత్యం కేసీఆర్‌కు వెన్నంటి ఉంటున్నారని తెలిపారు. ఆయనపై చేసిన ఆరోపణలను తెలంగాణ సమాజం ఏనాటికీ నమ్మబోదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టత కోసం హరీశ్‌రావు ఎంతో కృషిచేశారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు వివరించారు. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ముందుండి పోరాటం చేసిన హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో మహారాష్ట్రకు 25సార్లు వెళ్లి అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణంలో చేదోడువాదోడుగా ఉన్న హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు అర్థరహితమని పేర్కొన్నారు. ఒకవైపు కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందనే పూర్తి విశ్వాసం తనకు ఉన్నదని అంటూనే, మరోవైపు పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేవిధంగా కవిత మాట్లాడటం సరికాదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ వ్యాఖ్యానించారు. తాను ఏం చేస్తున్నారో ఒక్కసారి కవిత పునరాలోచించుకోవాలని కోరారు. అహిర్నశలు పార్టీ బలోపేతం కోసం కృషిచేస్తున్న హరీశ్‌రావుపై అనాలోచిత ఆరోపణలు చేయడం కవితకు తగదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ దిశానిర్దేశంలో నీటిపారుదల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాయకుడు హరీశ్‌రావు అని చెప్పారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ అధ్యక్షుడిగా తనకు సొంత కూతురైనా, సామాన్య కార్యకర్త అయినా సమానమేనని కేసీఆర్ నిరూపించారని కొనియాడారు. ప్రస్తుత పరిణామాలు బీఆర్ఎస్ కార్యకర్తల మనోైస్థెర్యాన్ని దెబ్బతీయలేవని తెలిపారు.