హైదరాబాద్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ) : రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో భారీగా పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో తమ సంస్థలను నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు రెండు రోజుల సదస్సులో ఏకంగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడించింది. వీటి ద్వారా సుమారు 13 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనున్నట్టు పేర్కొన్నది. తొలిరోజు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, రెండో రోజు రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు స్పష్టంచేసింది. అత్యధిక పెట్టుబడులు డాటా సెంటర్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మా, విద్యుత్ సెక్టార్లలో వచ్చినట్టు చెప్పింది. ఇందుకు సంబంధించి ఆయా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నట్టు వెల్లడించింది. ఆ సంస్థల పెట్టుబడులతో రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు ఎంతో దోహదపడనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, డాటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.