హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాల్ని అరికట్టేందుకు అద్భుతమైన ఆలోచన చేశారు. అదే షీ టీమ్స్ ఏర్పాటు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఆకతాయిల వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక విభాగాన్ని తీసుకొచ్చారు. సిబ్బందిని కేటాయించి, మహిళలను వేధించేవారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేలా శిక్షణ ఇప్పించారు. హైదరాబాద్‌లో విజయవంతమైన ఇలాంటి విభాగాల్ని అన్ని జిల్లాలకు విస్తరించారు.
పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం, సాంకేతికతను ఉపయోగించి ఆకతాయిలను అరికట్టడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సఫలీకృతమైంది. దీంతో షీటీమ్స్ అంటేనే ఆకతాయిలు హడలిపోయేలా కేసీఆర్ పదేళ్ల పాలన సాగింది. 2018లో ఏర్పడిన ఉమెన్ సేఫ్టీ వింగ్ విభాగంలో భాగస్వామిగా.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ మహిళలను ఆపదలో రక్షించే ఓ ప్రత్యేక వ్యవస్థగా షీటీమ్స్ నిలిచింది. దేశ, విదేశాలల్లో మన షీటీమ్స్ ఘనతను, మహిళల పట్ల వేధింపులను అరికట్టే విధానాన్ని కొనియాడారు. పదేండ్లలో 66,617 ఫిర్యాదులు అందగా.. 6,319 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
ఎప్పుడైనా& ఎక్కడైనా& షీ టీమ్స్
‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానంతో మహిళలకు పూర్తిగా సురక్షితమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో 2014 అక్టోబర్ 24న మొదట హైదరాబాద్ నగరంలో షీ టీమ్స్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో షీ టీమ్స్ సాధించిన అద్భుతమైన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తరించారు. ప్రజల నుంచి విశేషమైన స్పందన, సురక్షితమైన, పెట్టుబడుకు స్నేహపూర్వక నగరంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కి బలమైన సహకారం అందించడంలో షీటీమ్స్ పాత్ర కూడా ఉంది. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతీ జిల్లాలో షీ టీమ్స్ పని చేస్తున్నాయి. భవిష్యత్తులో వాటిని అన్ని పోలీసు సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లకు విస్తరించాలనుకుంటున్నట్ట్లు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయెల్ చెప్పారు. ప్రస్తుతం 30 పోలీసు యూనిట్లలో 328 మంది అధికారులు షీ టీమ్స్‌లో పనిచేస్తున్నారని ఆమె తెలిపారు.
షీటీమ్స్ కీలక విజయాలు..
2014 నుంచి 2024 వరకు
ఫిర్యాదులు : 66,617
ఎఫ్ఐఆర్లు : 6,319
పెట్టీ కేసులు : 17,460
కౌన్సెలింగ్ : 15,343
మైనర్లకు హెచ్చరిక : 16,169
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నవి : 13,895