Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ): వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు దంచుతున్నాయి. దీనికితోడు విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గురువారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 15,752 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండు నమోదైనట్లు టీజీ ట్రాన్స్‌కో ఎండీ వెల్లడించారు. ఇప్పటివరకూ గత ఏడాది మార్చి 8న నమోదైన 15,623 మెగావాట్ల డిమాండే అత్యధికం కాగా, గురువారం 129 మెగావాట్లు అధికంగా నమోదైనట్టు ఒక ప్రకటనలో తెలిపారు.
అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని, గత ఏడాది డిసెంబర్లో అంతకుముందు సంవత్సరం డిసెంబర్ నెలతో పోల్చుకుంటే 13.49శాతం, గత ఏడాది జనవరితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరిలో 10.10శాతం పెరుగుదల నమోదైనట్టు చెప్పారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 17,000 మెగావాట్ల వరకు సరఫరా చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
ఇందులో భాగంగా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లు దీర్ఘకాల కాంట్రాక్టుల నుంచే కాకుండా పవర్ ఎక్సేంజ్‌ల నుంచి కూడా విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయని టీజీ ట్రాన్స్‌కో ఎండీ తెలిపారు. పవర్ ఎక్సేంజ్‌ల ద్వారా విద్యుత్ కొనుగోలు వల్ల ఖర్చు తగ్గడంతోపాటు విద్యుత్ లోటును పూడ్చుకోవచ్చని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రత సగటున 32 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నది. గురువారం ఆదిలాబాద్‌లో 32.8 డిగ్రీలు, భద్రాచలంలో 35.6, హనుమకొండ 34, హైదరాబాద్ 33.5, ఖమ్మం 35.4, మహబూబ్‌నగర్ 35.6, మెదక్ 35.8 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.