ఇప్పుడు ఎక్కడ చూసినా ‘కార్నివోర్ డైట్’ గురించే చర్చ! ఫిట్నెస్ ప్రపంచంలో ఇదో హాట్‌టాపిక్. ప్లేట్లో నుంచి పప్పు, అన్నం, కూరగాయలను తీసేసి.. కేవలం చికెన్, మటన్, గుడ్లతోనే కడుపు నింపుకొనే ఈ ట్రెండ్ మనదేశంలో కూడా వేగంగా పాకుతున్నది. కానీ, కేవలం ముక్కలు తింటే ముచ్చటైన శరీరం వస్తుందా? లేక లేనిపోని రోగాలు కొనితెచ్చుకున్నట్టేనా? ఓ ఫిట్నెస్ ఫ్రీకర్గా మీరు తెలుసుకోవాల్సిన ఈ ‘మీట్-ఓన్లీ’ డైట్‌లోని లోగుట్టు ఏంటో చూద్దాం!!
డైట్ అనేది ఓ ‘ఎక్స్ట్రీమ్ ఎలిమినేషన్’ డైట్. అంటే ప్రకృతి మనకిచ్చిన ఆకుకూరలు, పండ్లు, పప్పు ధాన్యాలను పూర్తిగా పక్కన పెట్టేసి.. కేవలం
జంతువుల నుంచి వచ్చే ఆహారం మీదనే బతకడం. ఈ డైట్ పాటించే వారు కార్బోహైడ్రేట్లను సున్నా చేస్తారు. దీనివల్ల మన బాడీ శక్తి కోసం కొవ్వును కరిగించడం మొదలుపెడుతుంది. అందుకే చాలామందికి ఇది బరువు తగ్గడానికి షార్ట్కట్లా కనిపిస్తున్నది.
జీర్ణక్రియ సమస్యలు: ఫైబర్ (పీచు) లేకపోవడం వల్ల తీవ్రమైన మలబద్ధకం ఏర్పడుతుంది.
గుండె జబ్బులు: చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె పోటు ముప్పు పొంచి ఉంటుంది.
పోషకాహార లోపం: విటమిన్-సి, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి ముఖ్యమైన పోషకాలు అందకపోవడంతో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది.
కిడ్నీలపై ఒత్తిడి: అతిగా ప్రొటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
ఇండియాలో భోజనం అంటేనే రంగురంగుల కూరలు, పప్పులు, పెరుగుతో కూడిన ఓ సంపూర్ణ ఆహారం. ఇక్కడ కార్నివోర్ డైట్ పాటించడం ఓ పెద్ద సవాల్. నాణ్యమైన మాంసాన్ని రోజూ మూడు పూటలా తినడం అనేది సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే. పైగా మన జీవక్రియకు కావాల్సిన ఫైబర్ పప్పులు, ఆకుకూరల నుంచే వస్తుంది. వీటిని వదిలేయడం వల్ల అలసట, నీరసం ఆవహిస్తాయి. అంతేకాదు, మన దేశంలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో.. అతిగా మాంసాహారం తింటే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదమూ ఉంటుంది.
ఫిట్నెస్ అంటే ఒక రకమైన ఆహారాన్ని పూర్తిగా పాటించడమో, త్యజించడమో కాదు. నిపుణుడి సలహా మేరకు అన్నిరకాల పోషక విలువలు ఉన్న ఆహారాన్ని డైట్లో భాగం చేసుకోవాలి.