హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఇంతలో ఎంత మార్పు! ఒకప్పుడు తెలంగాణలో పంట పండాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి విత్తనాలు రావాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ నుంచే ఏపీకి విత్తనాలు సరఫరా అవుతున్నాయి. ఏపీలో పంట పండించేందుకు మన దగ్గర విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడి భూముల్లో ఉత్పత్తి చేసిన విత్తనాలను ఏపీలో రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ, నంద్యాల కేంద్రంగా కొనసాగుతున్న నేషనల్ సీడ్ కార్పొరేషన్.. తెలంగాణలోని పలు జిల్లాల్లో పల్లి విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో 2,952 ఎకరాల్లో వేరుశనగ విత్తనాల ఉత్పత్తిని నేషనల్ సీడ్ కార్పొరేషన్ ప్రారంభించింది.
అఫ్లాటాక్సిన్ రహిత విత్తనం
మన రాష్ట్రంలో పల్లి విత్తనాలను ఉత్పత్తి చేయటానికి ప్రధాన కారణం.. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పల్లిలో అఫ్లాటాక్సిన్ రసాయనం లేకపోవటమే. ఈ రసాయనం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రపంచంలోనే వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మాత్రమే అఫ్లాటాక్సిన్ రహిత పల్లి ఉత్పత్తి అవుతుంది. దీంతో పాటు ఇక్కడి భూములు సారవంతంగా, ఉత్పత్తి అయ్యే విత్తనంలో అధిక నాణ్యత ఉంటాయి. అందుకే ఆ రెండు సంస్థలు ఇక్కడ పల్లి విత్తన ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చాయి.
ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ
తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదిగింది. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా ఇక్కడ అనుకూలమైన వాతావరణం, నేలలు, ప్రభుత్వ ప్రోత్సాహం ఉండటంతో విత్తన కంపెనీలు ఇక్కడ తమ కంపెనీల ఏర్పాటుతో పాటు విత్తనోత్పత్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 400లకు పైగా విత్తన కంపెనీలు తెలంగాణ నుంచి తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయంటే రాష్ట్రంలో విత్తనరంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉత్పత్తి, ప్రాసెసింగ్ అవుతున్న విత్తనాలు దేశంలోని ఇతర రాష్ర్టాలు, పలు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతుండటం గమనార్హం. హైబ్రిడ్ వరి, మక్కజొన్న, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, గడ్డి జొన్న, గడ్డి సజ్జ ఇక్కడి నుంచి రష్యా, ఈజిప్ట్, సూడాన్, ఫిలిప్పీన్స్, టాంజానియాకు ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 3 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేయగా, అదిప్పుడు 8 లక్షల క్వింటాళ్లకు పెరిగింది. ఏటా 22-24 లక్షల టన్నుల విత్తనాలు ఇక్కడ ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.
విత్తన రంగానికి కేరాఫ్ తెలంగాణ
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, ఇక్కడి అనుకూల వాతావరణం వల్ల దేశ విత్తన రంగానికి తెలంగాణ కేరాఫ్‌గా మారింది. ఇతర రాష్ర్టాలు మన రాష్ట్రంలో విత్తనాలను ఉత్పత్తి చేసి అక్కడి రైతులకు పంపిణీ చేస్తున్నాయి. ఏపీ విత్తనాభివృద్ది సంస్థ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో వేరుశనగ విత్తనాలను ఉత్పత్తి చేయడమే ఇందుకు ఉదాహరణ.
– డాక్టర్ కేశవులు, ఎండీ, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ