తప్పుసర్కార్ది .. శిక్ష సిబ్బందికి!
ఎస్సీ గురుకులాల్లో అర్హతలున్న, సరిపడా సిబ్బందిని నియమించకుండా తాత్సారం చేస్తున్న సర్కార్ తప్పు జరిగితే మాత్రం సిబ్బందినే బలిపశువులను చేస్తున్నది. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా వార్డెన్లు ఉన్నారు. అయితే గురుకులాల నిర్వహణకు మాత్రం వార్డెన్లను నియమించలేదు.
- ఇదీ సాంఘిక సంక్షేమ గురుకులంలో దుస్థితి
- డిప్యూటీ వార్డెన్, ఏసీటీల తొలగింపు
- ప్రమోషన్లు ఇవ్వకుండా ఇన్‌చార్జులతోనే పాలన
- సీనియర్లను వదిలి జూనియర్లకు బాధ్యతలు
- పర్యవేక్షణ లోపం పేరిట సస్పెన్షన్లు
- ప్రభుత్వ తీరుపై గురుకుల టీచర్ల ఆగ్రహం
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకులాల్లో అర్హతలున్న, సరిపడా సిబ్బందిని నియమించకుండా తాత్సారం చేస్తున్న సర్కార్ తప్పు జరిగితే మాత్రం సిబ్బందినే బలిపశువులను చేస్తున్నది. సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా వార్డెన్లు ఉన్నారు. అయితే గురుకులాల నిర్వహణకు మాత్రం వార్డెన్లను నియమించలేదు. గురుకుల ప్రిన్సిపాల్ వార్డెన్‌గా కొనసాగుతున్నారు. ప్రిన్సిపాల్‌కు సహాయకారిగా, డిప్యూటీ వార్డెన్‌గా గురుకులంలోని టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) వ్యవహరించాల్సి ఉంటుంది.
రొటేషన్ పద్ధతిలో గురుకులంలోని టీజీటీ, పీజీటీలకు డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను ఆయా గురుకుల సొసైటీలు కేటాయిస్తూ వస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రివరకు అక్కడే ఉండి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందేలా చూడడం డిప్యూటీ వార్డెన్ల బాధ్యత. టీచింగ్ సిబ్బందికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను నిర్వహించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీలో గతంలో ఏసీటీ (అసిస్టెంట్ కేర్ టేకర్)లను ఔట్సోర్సింగ్ విధానంలో పలుచోట్ల నియమించారు. అయితే ఆశించినమేరకు బడ్జెట్ లేదని చెప్తూ ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు ఉన్న ఏసీటీలను తొలగించారు. డిప్యూటీ వార్డెన్ విధులను ఇష్టారీతిన నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు సైతం కేటాయిస్తున్నారు.
150 ప్రిన్సిపాల్స్ పోస్టులు ఖాళీ
ఎస్సీ గురుకుల సొసైటీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనే కీలక పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. అడిషనల్ సెక్రటరీ 1, జాయింట్ సెక్రటరీ 1, ఫైనాన్స్ సెక్రటరీ 1, దాదాపు 150 ప్రిన్సిపాల్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రమోషన్ల ద్వారా వాటిని భర్తీ చేయాల్సి ఉన్నా కూడా సొసైటీ ఉన్నతాధికారులు సుదీర్ఘకాలంగా డిప్యుటేషన్లపై పలువురికి అడ్డదారిలో కీలక స్థానాలను అప్పగించారు. ఉన్నతస్థాయి పోస్టులు మొదలు, ప్రిన్సిపాల్స్ వరకు ఇన్చార్జుల పాలనే కొనసాగుతుండడంతో గురుకుల వ్యవస్థ గాడి తప్పిందని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
తాజాగా ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని పరకాల-ఓగ్లాపూర్ టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్/జూనియర్ కళాశాల (బాలుర)లో విద్యార్థి మృతి ఘటనతో క్షేత్రస్థాయి పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో మరోసారి తేటతెల్లమైంది. కళాశాల ప్రిన్సిపాల్ ఉద్యోగ విరమణ పొందగా, ఆయన స్థానంలో సీనియర్లను నియమించాల్సి ఉన్నది. అయితే సర్కార్, ఉన్నతాధికారుల తీరుతో బాధ్యతల స్వీకరణకు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా జూనియరైన పీజీటీ (తెలుగు) ఉపాధ్యాయుడు ఆనందరావును నియమించారు. ఒకవైపు పనిఒత్తిడి, మరోవైపు అనుభవరాహిత్యం, సీనియర్ల నుంచి సహకారం లభించకపోవడంతో కళాశాల పర్యవేక్షణ, నిర్వహణ గాడి తప్పిందని, పలువురు విద్యార్థులు వ్యసనాలబారిన పడ్డారని విద్యార్థి సంఘాలే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులను కళాశాల నుంచి పంపించారు. అదేసమయంలో విద్యార్థి కార్తీక్ అక్టోబర్ 24న ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్రవివాదాన్ని రేపింది.
అనంతరం కంటితుడుపుగా విచారణ జరిపి ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌తోపాటు, హౌస్మాస్టర్ను సొసైటీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై గురుకుల టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలన గాడితప్పడానికి ప్రభుత్వం ప్రమోషన్లను కల్పించకుండా కాలయాపన చేయడమే కారణమని, తిరిగి సిబ్బందిపై చర్యలేమిటని నిప్పులు చెరుగుతున్నారు. ప్రతిసారీ ఇదే పునరావృతమవుతున్నదని మండిపడుతున్నారు. గడచిన 34 నెలల కాలంలో కల్పించిన ప్రమోషన్లు, బదిలీలు, విధానపర నిర్ణయాలన్నింటిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తక్షణం సమీక్షించాలని, లోపాలను సవరించాలని, అప్పుడే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గురుకుల వ్యవస్థ మొత్తంగా సంక్షోభంలో కూరుకుపోయి, నిర్వీర్యమయ్యే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు.
వెంటనే విధుల్లో చేరండి
- గ్రేడ్-1 ప్రిన్సిపాల్స్‌కు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు
ఎస్సీ గురుకుల సొసైటీలో 23 మంది గ్రేడ్ 2 ప్రిన్సిపాల్స్‌కు గ్రేడ్-1 ప్రిన్సిపాల్స్‌గా ప్రమోషన్ కల్పిస్తూ మే నెలలో ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన ప్రిన్సిపాల్స్‌కు కౌన్సెలింగ్ తేదీలను సైతం ప్రకటించారు. అయితే గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో ఆ ప్రమోషన్లను నిలిపేశారు. ఇప్పటివరకు అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నపళంగా గ్రేడ్-1 ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్లు పొందినవారికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తక్షణం విధుల్లో చేరాలని పేర్కొన్నారు. ప్రమోషన్లు పొందినవారికి విధుల్లో చేరేందుకు 15 రోజుల గడువు ఉంటుంది. కానీ ఆ సమయం కూడా ఇవ్వకుండా ఉన్నతాధికారులు ఒత్తిడి తేవడంలో ఆంతర్యమేందో అంతుచిక్కడం లేదు. అదీగాక జేఎస్ పోస్టుకు, జడ్వోల ప్రమోషన్లను కల్పించకుండా, మళ్లీ గ్రేడ్-1 ప్రిన్సిపాల్స్ ప్రమోషన్లను కల్పించడం గమనార్హం. కేవలం డీఎస్ పోస్టులను మాత్రం భర్తీ చేశారు. ఇందులో ఆంతర్యమేందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక భారీ అవినీతి దాగి ఉన్నదని ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

