హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందేనని, లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటామని సర్పంచుల సంఘం జేఏసీ హెచ్చరించింది. ఈ మేరకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసింది. బిల్లులు చెల్లించేవరకు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధమని, ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటామని జేఏసీ వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక మాజీ సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొంది. ప్రాణాలు పోతున్నా బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని, బిల్లులు చెల్లించేవరకూ పోరాటం ఆపబోమని స్పష్టంచేసింది.