Maharashtra | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర సర్కారుకు తెలంగాణ ‘సంక్షేమ’ ఫీవర్ పట్టుకొన్నది. తెలంగాణ రైతు సంక్షేమ పథకాలు అక్కడి సర్కారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. తెలంగాణతరహా రైతు, ప్రజా సంక్షేమ పథకాలను మహారాష్ట్రలోనూ అమ లు చేయాలని కోరుతూ గాంధేయవాది వినాయక్రావ్పాటిల్ 5రోజులపాటు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఏక్నాథ్ షిండే సర్కారును షేక్ చేసింది. ‘తెలంగాణ మాడల్’పై చర్చిద్దాం రమ్మని స్వయంగా వినాయక్రావ్కు సీఎం షిండే ఫోన్ చేసి ఆహ్వానించడం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
తెలంగాణ రైతు సంక్షేమ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేయాలని వినాయక్రావ్పాటిల్ అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్కడి ప్రభుత్వం ఎంతకూ స్పందించకపోవటంతో ఆయన ఆమరణ దీక్షకు దిగారు. ఈ దీక్ష లాతూర్సహా మహారాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేను వినాయక్రావ్పాటిల్ వద్దకు పంపించారు. వినాయక్రావ్కు సీఎం కేసీఆర్ దూతలు సంఘీభావం ప్రకటించారు.
‘ఆమరణదీక్ష’ ఆఖరి అస్త్రం కావాలని, గాంధేయమార్గంలో, శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేద్దామని కేసీఆర్ మాటగా వినాయక్రావ్కు వారు చెప్పారు. దీక్ష విరమించాలని అభ్యర్థించారు. ఈ పరిణామాలను గమనించిన మహారాష్ట్ర సర్కారు రంగంలోకి దిగింది. వినాయక్రావ్పాటిల్కు స్వయంగా మహారాష్ట్ర సీఎం షిండే శుక్రవారం ఫోన్‌చేసి.. ఈ నెల 9న ముంబైకి రావాలని ఆహ్వానించారు. వినాయక్రావ్పాటిల్ లేవనెత్తిన అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆమరణ దీక్షను విరమించారు. 9న మహారాష్ట్ర సచివాలయంలో సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్సహా ఉన్నతాధికారులు వినాయక్రావ్తో చర్చలు జరుపనున్నారు. మహారాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదని చెప్పేందుకు ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదని బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతలు పేర్కొన్నారు.
తెలంగాణ మాడలే శరణ్యం
సాగు నష్టాలతో మహారాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వీరిని ఆదుకోవాలంటే తెలంగాణ మాడల్‌ను అమలు చేయడం మినహా మరో దారిలేదని వినాయక్రావ్పాటిల్ మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్ర సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్, వ్యవసాయ, పశు సంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదనపు కార్యదర్శి, రెవెన్యూ సహా అన్ని శాఖల అధికారులకు లేఖలు రాశారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నారని, రాష్ట్రంలో 10 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని కోరా రు. ప్రధాన మంత్రి బీమా యోజనలో మార్పులు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వా రా చెల్లించే బీమా మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాలో జమ చేయాలని, 65 ఏండ్లు పైబడిన రైతులకు నెలకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనేక ఉత్తరాలు రాశారు. ఎమ్మెల్యేలు ముంబై, నాగ్‌పూర్‌లలో విలాసవంతమైన కార్లలో తిరుగుతారని, ఖరీదైన హోటళ్లలో బస చేస్తారని, ఆవ్యయాన్ని తగ్గించి మిగిలిన మొత్తాన్ని రైతు సంక్షేమం కోసం కేటాయించాలని ప్రతిపాదించారు.
గాంధేయవాదికి తెలంగాణ స్ఫూర్తి
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా కౌఠా ఉమ్రాకు చెందిన వినాయక్రావ్పాటిల్కు గాంధేయవాదిగా పేరున్నదని మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గె తెలిపారు. అన్నాహజారేతో కలిసి పనిచేశారని, రైతులు, పీడితుల హక్కుల కోసం ఏండ్లుగా పోరాడుతున్న గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌కు వినాయక్‌రావ్ సమీప బంధువని వెల్లడించారు. తెలంగాణ రైతుసంక్షేమ పథకాలతో స్ఫూర్తిపొంది.. మహారాష్ట్ర అన్నదాతల కోసం ఆయన ఆమరణదీక్షకు దిగారని పేర్కొన్నారు. వినాయక్‌రావ్ ఆమరణ దీక్ష విషయాన్ని తెలుసుకొన్న సీఎం కేసీఆర్ తనతోపాటు మాణిక్ కదంను ఆయన దగ్గరకు పంపారని, సత్యాగ్రహ పద్ధతిలో పోరాడుదామని కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు పాటిల్ చాలా సంతోషపడ్డారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కేవలం రెండు నెలల వ్యవధిలోనే మూడు సభలు నిర్వహించి, మహారాష్ట్ర ప్రజల్లో చైతన్యం తెచ్చారని, ఇదే స్ఫూర్తితో తాము ముందుకు సాగుతామని స్పష్టంచేశారు.
రైతు బంధు అమలు చేయాలి
తెలంగాణ సర్కారు వానకాలం (ఖరీఫ్), యాసంగి (రబీ) పంటలకు కలిపి ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నదని, పంటవేసే కాలానికి ముందే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నదని వినాయక్రావ్పాటిల్ లేఖల్లో పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు సాగునీటితోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్, ఏ కారణం వల్ల రైతు మరణించినా ఆ కుటుంబానికి ప్రభుత్వమే రూ. 5 లక్షల రైతుబీమాను అందిస్తూ ఆదుకుంటున్నదని మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం సహా ఉన్నతాధికారులకు లిఖిత పూర్వంగా తెలియజేశారు.