నిర్మాణ పనులకు త్వరలో టెండర్ల పిలుపు
నగరం నలుదిక్కులా కార్పొరేట్ దీటుగా
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. దవాఖానల నిర్మాణానికి ప్రభుత్వం రూ.2400 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చింది. అనుమతుల ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో రోడ్లు, భవనాల శాఖకు చేరే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు పిలిచి నిర్మాణ సంస్థను ఎంపిక చేస్తారు. అనంతరం నిర్మాణ పనులు మొదలవుతాయి. బడా కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా భారీ స్థాయిలో దవాఖానలను ప్రభుత్వం నిర్మించబోతున్నది.
గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ బిల్డింగ్‌లో ఇప్పటికే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను కొవిడ్ సమయంలో ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో మరో నూతన భవనాన్ని నిర్మించనున్నారు. దిల్సుఖ్నగర్ సమీపంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో, అల్వాల్‌లో, సనత్‌నగర్‌లోని చెస్ట్ దవాఖాన ప్రాంగణంలో అధునాతన వసతులతో దవాఖానలు నిర్మించాలని ఇదివరకే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.