హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విస్మరించిందని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్నదని, రైతులపై నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయరంగం పతనమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో 50శాతానికిపైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి సంపాదనలో అధికశాతం వడ్డీలకే పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల భారీ వర్షాలకు లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. రైతుల సమస్యలు, పరిష్కారాలపై రైతు సంఘాలతో చర్చించాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.