హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. పాలనాపగ్గాలు చేపట్టి 10 నెలలు దాటినా దీనిపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దశలవారీ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సామూహిక నిరాహారదీక్షలు చేపట్టారు.
ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ఉద్యోగ నియామకాలు లేక ఉన్న కార్మికులపై పనిభారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కార్మికుల కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే సెలవు మంజూరు కోసం శవంతో సెల్ఫీ పెట్టాలని అధికారులు అడగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి డిమాండ్ చేశారు. 2013 వేతన సవరణ బాండ్ బకాయిలను ఉద్యోగులందరికీ చెల్లించాలని, 2017 వేతన సవరణ చట్టప్రకారం బకాయిలు ఇవ్వాలని జేఏసీ వైస్ కన్వీనర్ మౌలనా కోరారు.
2021 వేతన సవరణను అమలు చేయాలని జేఏసీ కో కన్వీనర్ యాదయ్య డిమాండ్ చేశారు. సీసీఎస్‌కు రూ.900 కోట్లు, పీఎఫ్‌కు రూ.1,475 కోట్లు, ఎస్ఆర్బీఎస్, ఎస్‌బీటీకి రూ.650 కోట్ల చొప్పున సంస్థకు అందజేయాలని కోరారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెయింటెనెన్స్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పెన్షన్ల విషయంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ కో కన్వీనర్ సురేశ్, కోకన్వీనర్ యాదగిరి కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎల్ బాల్‌రాజు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాబు, ఎస్సీ, ఎస్టీ వెల్పేర్ అసోసియేషన్ చైర్మన్ పీ సుభాశ్, కండక్టర్ల ఐక్యవేదిక బాధ్యులు కేఆర్ కుమార్, తేజావతి పాల్గొన్నారు.