హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : రెండ్రోజుల నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలను గ్రూపులవారీగా విభజించి.. చర్చలు జరిపిన ప్రభుత్వం సమ్మెను వాయిదా వేయించడంలో సఫలమైంది. కార్మిక సంఘాల్లో ఐక్యత లోపించడం ప్రధాన కారణమైతే.. దానిని అదునుగా చేసుకొని, ప్రభుత్వానికి అనుకూలమైన సంఘాలతో చర్చలు మొదలుపెట్టి.. విడతలవారీగా ఆయా సంఘాలతో చర్చించి.. మంగళవారం సమ్మె నోటీసులు ఇచ్చిన కార్మిక సంఘాలను కూడా సమ్మె వాయిదాకు ఒప్పించింది. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడించారు. ప్రభుత్వ హామీలకు కార్మిక జేఏసీ అంగీకారంతో సమ్మె వాయిదా పడినట్లు ప్రభుత్వవర్గాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి.
చర్చల సందర్భంగా ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, యూనియన్లకు ఎన్నికలు నిర్వహించాలని మంత్రిని జేఏసీ కోరింది. ఆర్టీసీని విలీనం చేయాలని కోరగా.. ఈ రెండు ప్రధాన సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. యూనియన్లను అనుమతిస్తామని హామీ ఇచ్చారు.
బ్రెడ్ విన్నర్ సీమ్‌లో అపాయింట్ చేసే ఉద్యోగులను కన్సాలిడేటెడ్ పే విధానంలో రిక్రూట్ చేస్తున్నారని జేఏసీ నాయకత్వం మంత్రి దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై మంత్రి స్పందిస్తూ సింగరేణి కాలరీస్‌లో లాగా కార్మికులకు రెగ్యులర్ టైమ్ సేల్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీకి సబ్సిడీపై నేరుగా ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి ఒక నోట్ పంపినట్లుగా మంత్రి తెలిపారు. ఆర్టీసీ అన్ని క్యాటగిరీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు.
సమ్మెను వాయిదా వేసుకోవాలని మంత్రి కోరారు. మంత్రి, ముఖ్యమంత్రిపై నమ్మకముంచి సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో చైర్మన్ కే హనుమంతు ముదిరాజ్, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి తెలియజేశారు. సమస్యలు పరిషరించకపోతే మళ్లీ సమ్మెకు వెళ్తామని జేఏసీ స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు కూనంనేని, మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాంలకు మంత్రి పొన్నం, జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ చర్చల్లో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బాబు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అప్పారావు, టీఎంయూ అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి, టీజేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు, వరింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ జీపీఆర్ రెడ్డి, ఎన్ఎంయూ నాయకులు వీ బాబు, బీకేయూ నాయకులు ఏ రాములు పాల్గొన్నారు.
ఆర్టీసీలో రిటైరైన ఉద్యోగులకు సెటిల్మెంట్స్ వెంటనే విడుదల చేయకపోవడం, పెన్షన్ సౌకర్యం కూడా లేకపోవడంతో నెలవారీ జీతాలు లేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని మంత్రి దృష్టికి జేఏసీ తీసుకెళ్లింది. పాత బకాయితోపాటు కొత్తగా రిటైర్ అవుతున్నవారికి సెటిల్మెంట్స్ అన్నీ ఒకేసారి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 2017 వేతన సవరణ తర్వాత రిటైరైన ఉద్యోగులకు పే ఫిక్సేషన్ చేయిస్తామని, వారికి వేతన సవరణ బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2019 సమ్మె కాలపు కేసులను ఎత్తివేయాలని జేఏసీ కోరగా, కేసులను ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీఎస్, పీఎఫ్ బకాయిలను చెల్లిస్తున్నదని, నెలనెలా సీసీఎస్‌కు ఎంఆర్‌డీఎఫ్ అమౌంట్ రూ.21 కోట్లను అందజేస్తున్నదని, త్వరలోనే మిగతా బకాయిలు కూడా ఇచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.