హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ భవిష్యత్తు రూపకల్పన కోసం రాష్ట్ర ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ సిటిజన్ సర్వే గడువును నవంబర్ 1వరకు పొడిగించారు. ఇందులో పాల్గొనేవారు ప్రభుత్వ కార్యాలయాలు, మెట్రోస్టేషన్లు, విద్యాసంస్థలు, పౌర ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన క్యూఆర్ను సాన్చేసి లేదా www.telangana. gov.in/t elanganarising వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో ప్రతి పౌరుడి స్వరాన్ని ప్రతిబింబించే లక్ష్యంతో ప్రభు త్వం సర్వేను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ సర్వేలో ప్రజల ఆలోచన లు, కలలు, ప్రాధాన్యతలను సేకరించి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించనున్నారు. గత వారం ప్రారంభమైన ఈ సర్వేకు విశేష స్పందన లభిస్తున్నట్టు అధికారులు తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించి వందేండ్లు పూర్తికానున్న 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలి? అనేదానిపై వేలాది మంది ఇప్పటికే తమ అభిప్రాయాలు, సూచనలు పంచుకున్నట్టు వారు చెప్పారు. ప్రతి గ్రామం, పట్టణం, నగరంలోని ప్రజల ఆశయాలను ప్రతిబింబించేలా ఒక ప్రగతిశీల, సుస్థిర, సమానత్వ తెలంగాణ కోసం సమగ్ర మార్గపటాన్ని రూపొందించడమే సర్వే ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.