హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ రైజింగ్గా వెలుగొందిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. నాడు అన్నింటా అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైందని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్నింటా వెనుకబడిందని మే డే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసి అలవికాని హామీలు ఎందుకిచ్చారని నిలదీశారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కారుపై ఉన్నదని స్పష్టంచేశారు. లేదంటే ప్రజలు తగిన సమయంలో బుద్ధిచెబుతారని హెచ్చరించారు.