హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలు మేడిపండును తలపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఒప్పందాల విషయంలో ఇది రుజువు కాగా, తాజాగా మరొకటి వెలుగుచూసింది. డిజిటల్ వర్సిటీ ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అమలు సాధ్యంకాదని తేలింది. దీంతో ఈ ఒప్పందంపై సందిగ్ధం నెలకొన్నది.
ఫిజిక్స్‌వాలా అనే సంస్థ రాష్ట్రంలో డిజిటల్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చింది. డిగ్రీ, పీజీ కోర్సులను డిజిటల్‌గా నిర్వహిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నది. డిసెంబర్ 9న జరిగిన సమ్మిట్‌లో ఈ సంస్థ ఒప్పందం చేసుకున్నది. వర్సిటీ ఏర్పాటు విషయమై ప్రభుత్వ, ఆ సంస్థ ప్రతినిధులు ఇటీవలే పరస్పరం చర్చలు జరిపారు. విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులను సైతం పిలిచారు. అనుమతులు, వసతులు, సౌకర్యాల కల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సహకారం అందించాల్సి ఉంటుందన్న విషయాలను చర్చించారు. ఈ చర్చల్లోనే అసలు విషయం వెలుగుచూసింది.
దేశంలో డిజిటల్ వర్సిటీలను తెరిచేందుకు కేంద్రం ఎలాంటి పాలసీని రూపొందించలేదు. మార్గదర్శకాలు కూడా లేవు. ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలకే కేంద్రం అనుమతులు ఇస్తున్నది. కొత్త డిజిటల్ వర్సిటీకి అనుమతులు ఎవరిస్తారు? పర్యవేక్షణ ఎవరు చేస్తారు? అన్న అంశాలను కేంద్రం వెల్లడించనేలేదు. అడ్మిషన్ల ప్రక్రియ, సర్టిఫికెట్ల జారీ ఎలా అన్న విషయాలపైనా స్పష్టతేలేదు. మొత్తంగా అసలు వర్సిటీ ఏర్పాటు సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. కానీ ముందూవెనుకా చూడకుండా, ఇలాంటి విషయాలేవి పట్టించుకోకుండా సదరు విద్యాసంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఎంవోయూ చేసుకున్నది. ఇప్పుడు అసలు విషయం తెలుసుకుని నాలుక కరుచుకున్నది.
డిజిటల్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రప్రభుత్వం, యూజీసీ పలుమార్లు ప్రకటించిననా ఐదేండ్లుగా కార్యరూపం దాల్చలేదు. దూరవిద్య (ఓపెన్) కోర్సులు, ఆన్లైన్ కోర్సులను నిర్వహించేందుకే యూజీసీ సవాలక్ష నిబంధనలు పెడుతున్నది. న్యాక్ ఏప్లస్, న్యాక్ ఏ గ్రేడ్ పొంది, నడుస్తున్న విద్యాసంస్థలకే ఓపెన్, ఆన్లైన్ కోర్సుల నిర్వహణకు యూజీసీ అనుమతులు ఇస్తున్నది. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా సర్కారు పెద్దలు డిజిటల్ వర్సిటీ ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఇలాంటి డొల్ల ఎంవోయూలతో, సమ్మిట్ పేరిట కోట్లాది రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నీళ్లప్రాయంలా ఖర్చు చేశారన్న విమర్శలొస్తున్నాయి.